రాజ్‌భవన్‌ ఎదుట టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆందోళన విద్యార్థుల అరెస్ట్‌

అరెస్టు.. గోషామహల్‌కు తరలింపు
హైదరాబాద్‌, ఆగస్టు 9 :ఫీజు రియంబర్స్‌మెంట్‌పై విద్యార్థుల పోరు సాగిస్తున్నారు. గురువారంనాడు కూడా మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ను ముట్టడించేందుకు విద్యార్ధి సంఘాలు, యువజన సంఘాలు యత్నించాయి. ఫీజు రియంబర్స్‌మెంట్‌ను కొనసాగించాలని, పోలీసుల జులుం నశించాలని, అక్రమ అరెస్టులను నిలిపివేయాలని నినాదాలు చేస్తూ వారు మినిస్టర్స్‌ వద్దకు చేరుకున్నారు. మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ వద్దకు చేరుకున్న వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వారి మధ్య తోపులాట జరిగింది. కొందరు విద్యార్థులు లోపలికి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని నిలిపి వేశారు. కొద్దిసేపు తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. గోషామహల్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉండగా ఫీజు రియంబర్స్‌మెంటుపై మంత్రివర్గ ఉప సంఘం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 14 విద్యార్ధి సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. బుధవారం నుంచే ఆందోళనలను ప్రారంభించాయి. గురువారంనాడు కూడా ఆందోళనలను కొనసాగించాయి. మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ వద్ద గురువారం ఉదయం 3 సంఘాలు.. ఎఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిడిఎస్‌యు ఆధ్వర్యంలో విద్యార్థినీలు కూడా మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ వద్దకు చేరుకుని నిరసన తెలిపే అవకాశం ఉందన్న సమాచారం అందడంతో అక్కడ భారీగా మహిళా పోలీసులను మొహరింపజేశారు.