వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్‌ఆర్ సిపిలో చేరిక
కడప, ఆగస్టు 1 : పార్టీ నాయకత్వం వహిస్తున్న వ్యక్తి జైలులో ఉన్నా వేలాది మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా పార్టీలో చేరడం భవిష్యత్‌లో పార్టీ విజయానికి నిదర్శనమని వైఎస్‌ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. చిత్తూరు జిల్లా ఊతలపట్టు నియోజకవర్గానికి చెందిన వేలాది మంది కార్యకర్తలు మాజీ జడ్పీటీసీ సభ్యుడు బాబురెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఆమె సమక్షంలో పార్టీలో చేరారు. అంతకు ముందు ఇడుపులపాయకు వెళ్లి వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద దివంగత నేత వైఎస్‌ఆర్‌కు వారు ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత పులివెందులలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకొని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్తామని, ఆయన ఎంతో సంతోషిస్తారని చెప్పారు. జగన్‌కు త్వరలో బెయిల్ వస్తుందని, ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో అధికారంలో రావడం తథ్యమని చెప్పారు.