వ్యవసాయాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు

శ్రీకాకుళం, ఆగస్టు 2 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రాంగాన్ని విస్మరిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య విమర్శించారు. రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన జీపు యాత్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని లీడ్‌బ్యాంకు కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయదారులు ప్రకృతి వైఫరీత్యాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాల కారణంగా ఏటా అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారాన్నరు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశ పెట్టాలని డిమాండ్‌ చేశారు. అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కారం కోసం రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని సోంపేట నుంచి ప్రారంభమైన జీపు యాత్ర ఎనిమిది రోజుల పాటు 22 జిల్లాల్లో పర్యటించి 9న చెలో కలెక్టరేట్‌ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. అనంతరం ఎల్‌డీఎం శ్రీనివాసశాస్త్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి చాపర సుందర్‌లాల్‌, రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గంగాభవాని, జిల్లా కార్యదర్శి రంధి అయ్యప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు బుడితి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.