సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం

ఇది జనరంజక బడ్జెట్‌ : ఆనం
హైదరాబాద్‌, మార్చి 16 (జనంసాక్షి): బడుగు, బలహీన వర్గాలకు మేలు చేకూర్చే విధంగా బడ్జెట్‌ను రూపొందించామని ఆర్థిక శాఖమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి కలగల్సిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. సోనియాగాంధీ, ముఖ్యమంత్రి కిరణ్‌ ఆలోచనలకు అనుగుణంగా పేదలకు మేలు చేకూర్చాలన్న లక్ష్యంతో బడ్జెట్‌ రూపొందించామన్నారు. శనివారం సాయంత్రం ఆర్థిక శాఖాధికారులతో భేటీ అయ్యారు. బడ్జెట్‌పై తుది కసరత్తు చేశారు. అనంతరం మంత్రి ఆనం విలేకరులతో మాట్లాడారు. అనుభవజ్ఞులైన ఆర్థిక నిపుణులతో సంప్రదింపులు జరిపి ప్రయోగాత్మక బడ్జెట్‌ను రూపొందించామని చెప్పారు. వ్యవసాయం, సాగునీటి రంగాలకు అత్యధిక ప్రాధాన్యం  ఇచ్చామన్నారు. 2009 ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ఈ బడ్జెట్‌ను రూపొందించామన్నారు. 2013-14 బడ్జెట్‌ను విడిగా చూస్తే జలయజ్ఞానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. అలాగే అనుబంధ రంగాలన్నీంటిని కలిపి చూస్తే వ్యవసాయరంగానికి ప్రాధాన్యం చేకూరుతుందన్నారు. గత అనుభవాల దృష్ట్యా అవసరాల మేరకు బడ్జెట్‌ను రూపొందించామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక మాంద్యం, ఉద్యమాల వల్ల 10 శాతం వృద్ధి రేటును సాధించలేకపోయామన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగానే ఉందన్నారు. రానున్న రోజుల్లో అవరోధాలన్నీంటిని అధిగమిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు అనుగుణంగా ఆయా వర్గాల అభ్యున్నతికి 22.8 శాతం నిధులను కేటాయించామన్నారు. వ్యవసాయం, సాగునీటి రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. అవరోధాలన్నీంటిని అధిగమిస్తూ రాయితీలను కొనసాగిస్తామన్నారు. సబ్సిడీలను ప్రభుత్వం ఎన్నడూ భారంగా భావించలేదన్నారు. ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేస్తామన్నారు. ఈ నెల 18వ తేదీ ఉదయం 7.15 నిమిషాలకు క్యాబినెట్‌ సమావేశం జరుగుతుందని చెప్పారు. క్యాబినెట్‌ ఆమోదంతో అదే రోజు ఉదయం 10.26 నిమిషాలకు అసెంబ్లీలో తాను సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడతానని మంత్రి ఆనం చెప్పారు. శాసనమండలిలో దేవాదాయ శాఖమంత్రి సి.రామచంద్రయ్య సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడతారన్నారు. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అసెంబ్లీలో, మంత్రి శ్రీధర్‌ బాబు శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారని ఆర్థిక మంత్రి రాంనారాయణరెడ్డి చెప్పారు. 26వ తేదీన మూడు నెలల పద్దులను ఆమోదిస్తామన్నారు.