సవాళ్లను అధిగమించిన విశ్వాసం !
మనం ఏ పని మొదలు పెట్టినా మోకాలడ్డడం అలవాటు. రాజకీయ పార్టీలకు అయితే ఇక వేరుగా చెప్పాల్సి న పని లేదు. కరోనాకు వ్యాక్సిన్ తయారీకి పలు సంస్థలు ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు ఇదే తరహా పెదవి విరుపులు మొదలయ్యాయి. మోడీ అంటే పడదు గనక దానిని వ్యాక్సిన్ తయారీపై వ్యతిరేకతగా ప్రదర్శించారు. వ్యాక్సిన్ తయారయ్యాక కూడా అది కాషాయ వ్యాక్సిన్ అంటూ ఎగతాళి చేశారు. తొలుత మోడీ వేసుకోవాలని అన్నారు. అందులో కరోనా తయారు చేస్తున్న సంస్థల నిబద్దతపైనా నిందలు వేశారు. వ్యాక్సిన్ తయారీకి కనీసం మూడు నాలుగేళ్లు పడుతుందన్న వితండవాదన తీసుకుని వచ్చారు. ఇన్ని అనుమానాల మధ్య వందకోట్ల డోసులు పంపిణీ జరిగిందన్న వార్త ప్రపంచానికి ధైర్యాన్ని ఇచ్చింది. భారతీయుల్లో భరోసా నింపింది. నిజంగా గతేడాది కాలంలో కరోనా కాలంలో ఎన్నో వింతలు చూశాం. అయితే ఆత్మవిశ్వాసానికి మించిన విజయం లేదని నిరూపించాం. భవిష్యత్ దాడులపైనా భరోసా నింప గలిగాం. ఇక మనకేం కాదులే..అన్న ధీమాను వ్యాక్సిన్ ఇవ్వగలిగింది. ఇది సంతోషించాల్సిన విజయం. సంబరం చేసుకోవాల్సిన సందర్భం. తొమ్మిది నెలల క్రితం అనేక అనుమానాల మధ్య మొదలై, సవాలక్ష సమస్యలను దాటి గురువారం నాటికి అన్నీ కలిపి 100 కోట్ల కోవిడ్ టీకా డోసులు వేయడంలో మన దేశం సఫలమైంది. ప్రపంచం ముంగిట సగర్వంగా నిలిచింది. ప్రపంచ ఆరోగ్యసంస్థతో పాటు అనేక దేశాలు మన సత్తాను అభినందించాయి. చైనాలాంలి దశం సైతం మన సత్తాను అభినందించకుండా ఉండలేక పోయింది. ఇప్పటికీ పీడవదలని మహమ్మారిగా 22 నెలలుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనాపై పోరాటంలో… దేశవాళీ టీకాల రూపకల్పనతో భారత్ సృష్టించిన చరిత్ర అపూర్వం. ఇది మాటల్లో చెప్పలేని విజయ గర్వంగా చూడాలి. వంద కోట్లకు పైగా జనాభా ఉన్న రెండు ప్రపంచ దేశాల్లో ఒకటిగా టీకా ఉత్పత్తిలో సాధించిన ఘనత ఒక ఎత్తయితే ప్రజలకు ఉచితంగా అందచేయడం, ఇతర దేశాలకు తోడ్పాటు అందించడం భారత చరిత్రలో సువర్ణాధ్యాయంగా చూడాలి. ఇందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలను అభినందించాలి. కరోనా రక్కసిని ఎదుర్కొనేందుకు భారత్ చేపట్టిన బృహత్తర టీకా కార్యక్రమం కీలక మైలురాయిని దాటిందన్న వార్తను ప్రపంచ ఆరోగ్య సంస్థ సహ అభినందించడం మనకంతా గర్వకారణం. ఇదేదో అంకెల గారడీకి చెబుతున్న మాటలు కాదు. లేదా నమ్మించడానికి చేస్తున్న ప్రయత్నం అంతకన్నా కాదు. మన కళ్లముందు కనపడుతున్న సజీవ సాక్ష్యం. కేవలం తొమ్మిదంటే 9 నెలల్లోనే దేశవ్యాప్తంగా 100 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసి అరుదైన కీర్తి గడిరచడమన్నది ఓ మధురానుభూతిగాను..మహోజ్వల ఘట్టంగానూ చూడాలి. అయితే ’శతకోటి’ ప్రయాణంలో ఎన్నో అవాంతరాలు, మరెన్నో సవాళ్లను ఎదుర్కొ న్నాం. ఎందరో ఎన్నో విమర్శలు చేశారు. ఇది సాధ్యామేనా అంటూ పెదవి విరచిచారు. వ్యాక్సిన్ తయారీ అంత సులువు కాదంటూ శాపనార్థాలు పెట్టారు. ఇవన్నీ దాటుకుని ఈ ఘనత చేరుకున్నందుకు భారీతయు లుగా గర్వపడాలి. ఇలా విమర్శలు చేసిన వారిని క్షమించి వదిలేయాలి. అందుకే ఈ ప్రయాణాన్ని ఆందోళన నుంచి భరోసా వరకు అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. టీకా పంపిణీలో 100 కోట్ల మార్క్‌ను దాటిన సందర్భంగా ప్రధాని మోదీ ’టీమిండియా ` సవాళ్లకు లక్ష్యంతో సమాధానం’ అనే టైటిల్‌తో ఓ హిందీ పత్రికలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. టీకాలపై ఎన్ని అపోహలు సృష్టించినా, గందరగోళ పరిస్థితులు ఎదురైనా.. దేశ ప్రజల విశ్వాసంతోనే ఈ విజయం సాధించగలిగామన్నారు. ఇది నాది అని ప్రతిఒక్కరూ అనుకున్నప్పుడు.. ఏదీ అసాధ్యం కాదు. దేశ ప్రజలందరికీ టీకాలు అందించాలన్న లక్ష్యంతో మన ఆరోగ్య కార్యకర్తలు ఎంతో శ్రమించారు. కొండలు ఎక్కి.. నదులు దాటారు. ప్రతికూల
భౌగోళిక పరిస్థితులను అధిగమించారు. సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలు, యువత కలిసికట్టుగా పనిచేశారు. అందుకే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో టీకాపై సంకోచాలు కాస్త తక్కువనే చెప్పాలి. నిజానికి దాదాపు 100 ఏళ్ల తర్వాత మానవాళి కనీవినీ ఎరుగని మహా మహమ్మారిని ఎదుర్కొం టోంది. కన్పించని శత్రువు వేగంగా పాకుతుంటే ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితుల్లో పడిపోయాం. అలాంటి ఆందోళనల నుంచి బయటపడి టీకాలు తయారుచేసుకున్నాం. ఇదంతా శాస్త్రవేత్తల కృషిగా చూడాలి. వారిలో కలిగిన కసిగా చూడాలి. వారి ఆత్మస్థయిర్యంగా చూడాలి. విూరు ముందుకు నడవండని ప్రధాని మోడీ ఇచ్చిన భరోసా కూడా తోడయ్యింది. అందుకే ఇప్పుడు 100 కోట్ల మైలురాయిని దాటుకుని మహమ్మారి నుంచి బయటపడగలమనే భరోసా ఇవ్వగలుగుతున్నాం. ఈ ప్రయాణంతో మనం మరింత బలంగా మారాం. అన్నింటికి మించి అందరికీ సమానంగా వ్యాక్సిన్‌ను అందజేయగలగడం మరో విశేషం. ఇల్లిల్లూ తిరుగుతూ..ఊరూవాడా దండోరా వేస్తూ వ్యాక్సిన్ వేయడం మరో విజయంగా చూడాలి. ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన విశ్వాసం కారణంగానే ఈ రోజు ఈ ఘనత సాధించామని చెప్పాలి. స్వదేశీ టీకాలపై ప్రజలు నమ్మకం ఉంచడం చాలా సంతోకరమైన విషయం. ఇకపోతే టీకాలు తీసుకోవద్దని భీష్మించుకున్న ఎందరో ఈ విజయాలను చూశాక ఇప్పుడు మళ్లీ మాకు టీకాలు వేయండని ముందుకు వస్తున్నారు. గొడవలకు దిగుతున్నారు. ఇది కూడా భరోసా ద్వారా వచ్చిన ధైర్యంగా చూడాలి. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ఇక కరోనా మనలను ఏవిూ చేయదన్న ధైర్యం కూడా వచ్చింది. టీకా పంపిణీ ప్రారంభించిన తొలినాళ్లలో 130 కోట్ల మంది భారతీయులకు వ్యాక్సిన్లు ఇవ్వాలంటే 3`4 ఏళ్లు పడుతుందని కొందరు అన్నారు. అసలు టీకాలు తీసుకోవడానికి ప్రజలు ముందుకురారని అన్నవాళ్లూ ఉన్నారు. వాటన్నింటికీ నేడు తగిన సమాధానం ఇచ్చినట్లుగానే భావించాలి. జూన్‌లో చైనా వంద కోట్ల మార్కు దాటాక, మళ్ళీ ఆ పని సాధ్యం చేసింది మనమే. విధాన రూపకర్తల మొదలు టీకా తయారీదార్లయిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ లాంటి సంస్థలు, అనుమానాలను తీర్చి టీకాలను ప్రజలకు చేర్చిన డాక్టర్లు, సుదూర ప్రాంతాలకు ప్రయాణించిన సామాన్య ఆరోగ్య కార్యకర్తల దాకా కొన్ని కోట్ల మంది కృషి ఫలితం ఇది. ఈ విజయంలో అందరి పాత్రా ఉంది. అందరికీ మనం అభినందనలు తెలపడం ద్వారా కృతజ్ఞతలు చాటాలి.