సీమాంధ్రులు కొల్లగొట్టిన ఆస్తులు కక్కిస్తేనే తెలంగాణ :మధుయాష్కీ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి):
సీమాంధ్ర ఎంపీల ఆస్తులను ముట్టడిస్తే తప్ప తెలంగాణ వచ్చేలా లేదని కాంగ్రెస్‌ ఎంపీ మధుయాష్కీ అన్నారు. రాజ్యసభ సభ్యుడు కెవిపి ఆధ్వర్యంలో టి. సుబ్బిరామిరెడ్డి, లగడపాటి, కావూరి, రాయపాటి లాంటి పదిమంది సీమాంధ్ర ఎంపీలు తమ అక్రమ ఆస్తులను రక్షించుకోవ డానికే తెలంగాణను అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. నెలాఖరులోగా తెలంగాణ వచ్చే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియా తో మాట్లాడారు. సంప్రదింపుల పేరుతో హైకమాండ్‌ తెలంగాణ అంశాన్ని దాటవేయటం, సాగదీయడం మంచిది కాదని ఇదే విషయాన్ని టీ కాంగ్రెస్‌ ఎంపీలు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌కు వివరించినట్లు ఆయన చెప్పారు. టీడిపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే, అప్పుడు కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ప్రశ్నిస్తారని అన్నారు. కాంగ్రెస్‌పై ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. సీమాంధ్ర ఎంపీల లాబీయింగ్‌ వల్లే తెలంగాణ ఆలస్యమవుతోందని అన్నారు. ఆజాద్‌ వ్యాఖ్యలు సీమాంధ్ర ఎంపీల తీరు చూస్తుంటే తెలంగాణ ఈ నెలలో సాధ్యమయ్యేలా కనబడటం లేదన్నారు. తెలంగాణ ఇచ్చే అవకాశమే ఉంటే ఆ సమాచారం ముందుగా తెలంగాణ ప్రాంత ఎంపీలకే తెలుస్తుందని యాష్కీ అన్నారు. తెలంగాణ ప్రాంతానికి సీఎం పదవి ఇస్తే ప్రత్యేక రాష్ట్రం క్లిష్టం అవుతోందని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. ప్యాకేజిలు, సీఎం పదవులు తెలంగాణ ప్రజలు ఒప్పుకోరని మధుయాష్కీ స్పష్టం చేశారు. విజయమ్మ ఆరోపణలపై నోరు మెదపని కెవిపి తన విలువను పెంచుకునేందుకే వైయస్‌ డైరీ పేరిట సభను నిర్వహించారని యాష్కీ ఆరోపించారు. తెలంగాణ ఎంపీలు చల్లబడ్డరన్న వార్తలను ఆయన ఖండించారు. తాముతెలంగాణ కోసం ఆందోళనలు చేస్తుంటే మేడం సోనియా తమ ఆందోళన ప్రతిపక్షాలకు ఉపయోగపడుతోంది. ఈ మార్గంలో మీరు కోరుకున్నది సాధించడం కష్టమవుతుందని సూచించడంతో తాము కొంత కాలం మౌనంగా ఉన్నట్టు పేరొన్నారు.