అంటువ్యాధులపై ఎపి సర్కార్‌ అప్రమత్తం

అమరావతి,ఆగస్ట్‌30: అంటువ్యాధులు సోకకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ అన్నారు. పారిశుద్యం విషయంలో ప్రజలు కూడా బాధ్యతగా ఉన్నప్పుడే వ్యాధుల నివారణ సాధ్యమని అభిప్రాయపడ్డారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, మందులు అందుబాటులో ఉంచామని, ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే సాయం అందేలా చూస్తున్నామని అన్నారు. విషజ్వరాలు లేదా మలేరియా లాంటి జ్వరాలు వస్తే తోణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలన్నారు. డెంగీ జ్వరాలకు సంబంధించి పాజిటివ్‌ కేసు అని వస్తే సంబంధిత రోగి వివరాలు.. అతనికి చేసిన వైద్య పరీక్షల వివరాలు, నివేదికలు మొత్తం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలకు అందజేయాలని గతేడాది ఆదేశించారు. ఆ తర్వాతే అతనికి వైద్య పరీక్షలు అందజేయాలని స్పష్టం చేశారు. ఈ తరహా కేసుల్లో ఆస్పత్రుల దోపిడీపై ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు ఏవైనా విధిగా డెంగీ జ్వరాలకు సంబంధించి పాజిటివ్‌ అని తేలితే ఆ వివరాలను తెలియజేయాలని సూచించారు. గతేడాది డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా ప్రబలినందున చర్యలు తీసుకున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు పంపిన పాజిటివ్‌ కేసులకు సంబంధించి మరోసారి వారికి డెంగీ పాజిటివ్‌ అవునా కాదా అని నిర్ధారించటానికి రాష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రుల్లో ఎలీశా పరీక్షలు జరిపిస్తారు. తమ పరిశీలనలో వచ్చిన వివరాల ఆధారంగానే రోగికి వైద్యం చేయాలా? వద్దా అనేది తెలియజేస్తారు. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధుల దృష్ట్యా మరోవైపు జిల్లా

వైద్యఆరోగ్య శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. వారి పరిధిలో ఉన్న అన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్లి జ్వరాలతో బాధపడుతున్న రోగులు.. వారికి అందిస్తున్న వైద్య పరీక్షలకు సంబందించిన వివరాలు సేకరించేలా చేశారు. గతేడాది అనుభవాలతో వజయవాడ, గుంటూరు రెండు బోధనాసుపత్రుల్లో డెంగీకి సంబంధించిన ఎలీశా పరీక్ష నిర్ధారణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అవసరమైన వైద్యనిపుణులు, పారామెడికల్‌ సిబ్బంది, ఎక్విప్‌మెంట్‌ను అందుబాటులో పెట్టుకుని కేవలం 12 గంటల్లోపే పరీక్షలు పూర్తి చేసి వాటి వివరాలను వైద్యశాలలకు తెలియజేస్తున్నారు.

తాజావార్తలు