అక్టోబర్‌ 2నుంచి కాంగ్రెస్‌ వ్యతిరేకపోరాటం

న్యూడిల్లీ: అవినీతిలో కాంగ్రెస్‌ పార్టీ కొత్త రికార్డు సృష్టించిందని ప్రముఖ యోగా గురువు, సామాజిక ఉద్యమకారుడు బాబా రాందేవ్‌ ధ్వజమెత్తారు. కుంభకోణాల్లో ఆ పార్టీ గోల్డ్‌ మెడల్‌ సాధించిందని ఎద్దేవా చేశారు. బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలకు బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ కేటాయింపులను రద్దు చేయాలని పునరుద్ఘాటించారు. రాందేవ్‌ శనివారం డిల్లీలో మీడియాతో మాట్లాడారు. తన ఆధ్యర్యంలో నడుస్తున్న ఆశ్రమం, ట్రస్టుకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తన ఆశ్రమంలోని వారిక లంచాలిచ్చి తనపై ఉసిగొల్పేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై తన వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని, ఇప్పటికే పోలీసు ఫిర్యాదు చేశానని చెప్పారు. రాందేవ్‌ ట్రస్టు స్వచ్ఛంద సేవా సంస్థ కాదని, దానికి అన్ని మినహాయింపులను రద్దు చేస్తూ ఆదాయపు పన్నుశాఖ తీసుకున్న నిర్ణయంపై ఆయన సమర్పించారు. దేశంలో 5లక్షలకు పైగా సేవా సంస్థలు సని చేస్తున్నాయని, తాము చేస్తున్న ప్రజాసేవను వ్యాపారమని మాట్లాడకుండా వారిని నియంత్రించాలని సోనియాగాంధీకి సూచించారు.
కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా గాంధీ జయంతి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళన ప్రారంభించనున్నట్లు బాబా రాందేవ్‌ ప్రకటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల దృష్టి సారించినట్లు వెల్లడించారు.

తాజావార్తలు