అత్తను హతమార్చిన అల్లుడికి జీవిత ఖైదు

తెనాలి: కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తను హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ తెనాలి 11వ అదనపు జిల్లా జడ్జి ఎం.వెంగయ్య బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. దుగ్గిరాల మండలం చుక్కపల్లివారిపాలానికి చెందిన శ్రావణి ఎలియాస్‌ తిరుపతమ్మకు కొల్లిపర మండలం దావులూరుకు చెందిన కోలాటి నాగరాజు ఎలియాస్‌ రాజుతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు. కొంత కాలానికి భార్య శ్రావణిని అనుమానంతో నాగరాజు మానసికంగా, శారీరకంగా వేధించాడు. ఆతర్వాత తెనాలి ఐతానగర్‌లో భార్యతో కాపురం పెట్టాడు. ఈ నేపథ్యంలో శ్రావణి గర్భం దాల్చడంతో నాగరాజు ఆమెతో గొడవ పడ్డాడు. భర్త వేధింపులు భరించలేక శ్రావణి పుట్టింటికి వెళ్లింది. దీంతో నాగరాజు చుక్కపల్లివారి పాలెం వెళ్లి భార్యతో, అత్తతో గొడవపడి చంపుతానని బెదిరించాడు. గత ఏడాది జనవరి 21న తల్లి నాగేంద్రమ్మతో కలిసి ఆసుపత్రికి వచ్చిన శ్రావణి మార్కెట్‌ సెంటర్‌లోని హోటల్‌లో తల్లితో కలిసి టిఫిన్‌ చేస్తుండగా నాగరాజు వారిపై దాడి చేశాడు. తన వద్ద ఉన్న కత్తితో అత్త నాగేంద్రమ్మ గొంతు కోశాడు. దీంతో ఆమె మృతి చెందింది. అడ్డుపడిన భార్య శ్రావణిని గాయపర్చాడు. శ్రావణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ ఎం.కమలాకరరావు దర్యాప్తు జరిపి నిందితుడిని కోర్టుకు హాజరుపరిచారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడు నాగరాజుకు జీవిత ఖైదు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఏపీపీ దాసరి శ్రీధర్‌ ప్రాసిక్యూషన్‌ నిర్వహించారు.

తాజావార్తలు