హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ నగర అభివృద్ధి

` అభివృద్దిని అడ్డుకునే కుట్రలను సహించం
` కిరాయ మూకల దాడులను చీల్చిచెండాడుతాం
` దుర్బుద్ధి పనులను మార్చుకోకుంటే జైలుకే..
` కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ వీడి ప్రజల్లోకి రావాలి
` తెలంగాణను నిండా అప్పుల్లో ముంచారు
` తాగుబోతుల రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనుడు
` మహిళల అండతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు
` వారి అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం
` వరంగల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం
` విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌
వరంగల్‌(జనంసాక్షి):తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేలా బీఆర్‌ఎస్‌ నేతలు కుట్రలు చేస్తే జైల్లో పెడతాం అని సిఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. కుట్రలు కుతంత్రాలతో అభివృద్దిని అడ్డుకోలేరని అన్నారు. పదేళ్లపాటు తెలంగాణను దోచుకున్న సొమ్ముతో కిరాయిమనుషులతో అడ్డుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. వరంగల్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ పార్టీపై, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం చేయలేని పనులు తాము చేస్తుంటే పనులు చేస్తుంటే కుట్రలు, కిరాయి రౌడీలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. దుర్బుద్ధితో అభివృద్ధి పనులను అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేసీఆర్‌ అనే మొక్కను తెలంగాణ గడ్డపై మళ్ళీ మొలవ నివ్వనని శపథం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ తెచ్చిన బెల్ట్‌ షాపులు ఊరురా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకైక అధ్యక్షుడు కేసీఆర్‌ అని.. ఆయన ఫుల్‌ బాటిల్‌కు బ్రాండ్‌ అంబాసిడరని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న పదేళ్ల పాటు కేసీఆర్‌ జనాన్ని మత్తులో ముంచెత్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోన్న సందర్భంగా ప్రభుత్వం` ప్రజా పాలన`ప్రజా విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం వరంగల్‌ ఆర్ట్స్‌ కాలేజీలో ప్రజా పాలన విజయోత్సవ తొలిసభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరై సీఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మాట ఇచ్చి.. పదేళ్లలో రుణమాఫీ చేయలేదని సీఎం రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం ఆరు నెలల్లోనే రుణమాఫీకి రూ.18వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఒక్కసారి ఓడిస్తే.. మళ్లీ ప్రజల మొహం చూడరా? అధికారం ఇస్తే దోచుకోవడం.. ఓడిస్తే ఫామ్‌హౌస్‌లో కూర్చోవడమేనా విూ పని అని ప్రశ్నించారు. ప్రజల విూద ప్రేమ ఉంటే ఎందుకు ప్రజల మధ్యకు రావడం లేదని నిలదీశారు. నిజంగా ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ల మధ్యకు వచ్చి ఎందుకు అడగటం లేదన్నారు. రాహుల్‌ గాంధీని చూసి కేసీఆర్‌ బుద్ధి తెచ్చుకోవాలన్నారు. మూడుసార్లు అధికారం దక్కకపోయినా.. రాహుల్‌ గాంధీ ప్రజల మధ్యే ఉన్నారని గుర్తు చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ తన బాధ్యతను ఎందుకు నిర్వర్తించడం లేదని నిలదీశారు.రాష్ట్ర ఆదాయం నెలకు రూ.18500 కోట్లలో రూ.6500 కోట్లు జీతాలు రూపంలో.. మరో రూ.6000 కోట్లు కేసీఆర్‌ చేసిన అప్పులకు వడ్డీ రూపంలో పోతున్నాయని తెలిపారు. దీనిపై అసెంబ్లీలో చర్చ పెడదాం రావాలని కేసీఆర్‌, హరీష్‌ రావు, కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. నువ్వు అసెంబ్లీకి రావు.. ఇద్దరు చిల్లరగాళ్ళను వదిలావని కేటీఆర్‌, హరీష్‌ రావుపై ఘాటు విమర్శలు చేశారు. అభివృద్ధిని అడ్డుకోవాలని ఎవరైనా కుట్రలు కుతంత్రాలు చేస్తే జైల్లో పెట్టీ ఊచలు లెక్క పెట్టిస్తామని హెచ్చరించారు. 11 నెలల్లోనే ప్రజలు ఏం కోల్పోయారో వాళ్లకు తెలిసొంచ్చిదన్న కేసీఆర్‌ వ్యాఖ్యలకు సైతం కౌంటర్‌ ఇచ్చారు. కేసీఆర్‌ విూరు ఫామ్‌ హౌజ్‌లోనే ఉండండి.. ప్రజలు ఏం కోల్పోలే.. విూ ఇంట్లో నలుగురి పదవులు మాత్రం పోయాయని రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చారు. దీంతో 50వేలమందికి ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారం దిగిపోతే కేసీఆర్‌, కుటుంబ సభ్యుల ఉద్యోగాల ఊడాయి తప్ప.. రాష్టాన్రికి ఏం కాలేదు. కేసీఆర్‌.. హాయిగా విూరు ఫామ్‌ హౌస్‌లో పడుకోండి. అవసరమైతే అక్కడే వైన్‌ షాప్‌ ఏర్పాటు చేయిస్తా. విూ ఉద్యోగాలు పోయాయి కాబట్టి రైతులకు రుణమాఫీ జరుగుతోంది. ఇంకా కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు. కచ్చితంగా చేసి తీరుతాం. అభివృద్ధిపై చర్చకు బిర్లా`రంగాలు సిద్ధమా..? రైతు రుణమాఫీ చేస్తే అభినందించాల్సిందిపోయి విమర్శిస్తున్నారు. వరి వేస్తే ఉరే అని కేసీఆర్‌ అనలేదా?. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అసెంబ్లీకి వచ్చి చెప్పాలి. నువ్వు ఎప్పుడంటే అప్పుడు అసెంబ్లీ పెట్టిస్తా. కేసీఆర్‌ ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలి. ఆయన రాకుండా ఇద్దరు చిల్లరగాళ్లను పంపుతున్నారని మండిపడ్డారు. వరంగల్‌ను అభివృద్ధి చేస్తే సగం తెలంగాణను వృద్ధిలోకి తీసుకొచ్చినట్లేనని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఉత్తర తెలంగాణకే తలమానికంగా వరంగల్‌ ను అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్‌ జిల్లా మంత్రి, ఇన్‌ఛార్జ్‌ మంత్రి పట్టుబట్టి అభివృద్ధి పనులను సాధించుకున్నారని చెప్పారు. విమానాశ్రయంతో వరంగల్‌ రూపురేఖలు మారనున్నాయన్నారు. చాలా రాష్టాల్ల్రో నాలుగైదు విమానాశ్రయాలు ఉన్నాయని.. తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఒకేఒక ఎయిర్‌పోర్టు ఉందన్నారు. ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలంతా కోరుకున్నారని.. తమను దీవించి పదవులిచ్చిన ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆడబిడ్డలను కోటీశ్వరులుగా మార్చేందుకు ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. గత ప్రభుత్వంలో కొన్నేళ్లపాటు మహిళా మంత్రి కూడా లేరని గుర్తు చేశారు. కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసేందుకు గత ప్రభుత్వానికి పదేళ్లపాటు మనసొప్పలేదని, ఎంతో పట్టుదలతో కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేశామన్నారు. వరంగల్‌ గడ్డ నుంచి రైతులందరికీ మరోసారి మాట ఇస్తున్నా. సాంకేతిక కారణాల వల్ల కొందరికి రూ.2లక్షలలోపు రుణమాఫీ వర్తించలేదు. ఇచ్చిన మాట ప్రకారం రుణాలన్నీ మాఫీ చేస్తాం అని సీఎం ప్రకటించారు. తెలంగాణ గడ్డపై సూర్య, చంద్రులు ఉన్నంత వరకూ ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలు, ఆడబిడ్డలకు సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తాను టీపీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యానని రేవంత్‌ రెడ్డి చెప్పారు. విూరు భుజాల విూద మోయబట్టే మేమంతా ఇవాళ వివిధ హోదాల్లో ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే ఆడబిడ్డల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీపై ఉంది. 2014 నుంచి 2019 వరకూ బీఆర్‌ఎస్‌ మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రిగా లేరని ఆయన చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ మహిళలు ఇచ్చిన తీర్పుతో మొదటి మంత్రివర్గంలోనే కొండా సురేఖ, సీతక్కకు మంత్రులుగా అవకాశం కల్పించామని సీఎం చెప్పుకొచ్చారు. ఈ ఓరుగల్లు ఆడబిడ్డలకే మంత్రివర్గంలో ప్రముఖస్థానం ఇచ్చి నేటి సభా నిర్వహణ కార్యక్రమాన్ని సైతం వారి చేతుల్లోనే పెట్టామని రేవంత్‌ తెలిపారు. ఇదే కాకుండా వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి కడియం కావ్యను పార్లమెంట్‌కు పంపించామని ఆయన చెప్పారు. ఆమె తెలంగాణ సమస్యలపై పార్లమెంట్‌లో గళం విప్పుతోందని అన్నారు. పాలకుర్తిలో ఓ రాక్షసుడు రాజ్యమేలుతుంటే యశస్విని రెడ్డి అనే సోదరి ఆ రాక్షసుడిని ఎన్నికల్లో ఓడిరచి పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరవేసిందని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. తెలంగాణ చీఫ్‌ సెక్రటరీ కూడా ఆడబిడ్డనే అని ఆయన తెలిపారు. అనేక మంది మహిళా అధికారులు పలు జిల్లాలకు కలెక్టర్లుగా ఉన్నారని వెల్లడిరచారు. వరంగల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా కూడా ఓ మహిళలే ఉందని సీఎం చెప్పుకొచ్చారు. వారి రుణం ఇంకా తీర్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్‌ రెడ్డి చెప్పారు. తెలంగాణను అవమానించిన, వ్యతిరేకించిన ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఊడిగం చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. గెలిపించిన సికింద్రాబాద్‌ ప్రజలను కిషన్‌ రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. గుజరాత్‌లో సబర్మతి సుందరీకరణను సమర్థించి.. మూసీ సుందరీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క,కోమటిరెడ్డి,శ్రీధర్‌ బాబు, పొంగులేటి,జూపల్లి, పొన్నంప్రభాకర్‌, కొండా సురేఖ, సీతక్క, ఎంపి కడియం కావ్య, కడియం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు
అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. హనుమకొండలో ప్రజా పాలన విజయోత్సవ సభలో భట్టి మాట్లాడారు. వచ్చే పదేళ్లలో మహిళలకు రూ.లక్ష కోట్ల మేర వడ్డీ లేని రుణాలిస్తాం. వారిని లక్షాధికారులను చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చే కార్యక్రమాలను చేపడుతున్నాం. సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశం వారికి కల్పిస్తున్నాం అని భట్టి తెలిపారు. మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్‌ న్యూస్‌ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని మహిళలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామని ప్రకటించారు. మహిళలను లక్ష్యాధికారులను చేయడమే కాంగ్రెస్‌ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే సోలార్‌ పవర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం మహిళలకు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోన్న సందర్భంగా మంగళవారం వరంగల్‌ ఆర్ట్స్‌ కాలేజీలో ప్రజా పాలన`ప్రజా విజయోత్సవ తొలి సభ నిర్వహించారు. ఈ సభకు హాజరై డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని దుయ్యబట్టిన భట్టి.. రాష్ట్రంలో మేం అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, 25 వేల కోట్ల వడ్డీ లేని రుణాలతో మహిళా సాధికారతకు కృషి చేశామని గుర్తు చేశారు. మహిళల కోసం మా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని..రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళల సంక్షేమం కోసం ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఈ విషయం చెప్పేందుకే ఇక్కడ సభ పెట్టామని తెలిపారు. వరంగల్‌ పట్టణాభివృద్ధి కోసం దాదాపు రూ.6 వేల కోట్ల నిధులు మంజూరు చేశామని.. వరంగల్‌?ను మహా నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్నీ వాగ్దానాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని.. అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నామన్నారు. ఇచ్చిన ప్రతి ఒక్క హావిూని ప్రభుత్వం నేరవేరస్తోందని అన్నారు. వరంగల్‌లో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. డిజిటల్‌ విధానంలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించారు. కాళోజీ జీవిత విశేషాలను తెలిపేలా కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫొటో ప్రదర్శనను సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు తిలకించారు. కళాక్షేత్రం ముందు ఏర్పాటు చేసిన కాళోజీ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.

తాజావార్తలు