అనధికార చెరువులను అంగీకరించం
ఏలూరు,అక్టోబర్18(జనంసాక్షి): జిల్లాలో అనధికార చేపల చెరువులను అంగీకరించేది లేదని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. జిల్లాలో అనధికారికంగా సుమారు వేల ఎకరాల్లో చేపల చెరువులున్నాయన్నారు. సాగునీరు ప్రవహించేందుకు ఎక్కడైనా చేపల చెరువులు అడ్డుగా వస్తే తొలగించాల్సిందేని స్పష్టం చేశారు. శివారు ప్రాంత భూములకు కూడా రబీలో సాగునీరు అందేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈసారి మూడో పంట సాగుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉద్యానతోటల్లో తేనెటీగలను పెంచడానికి 20 వేల పెట్టెలను ఏర్పాటు చేయాలన్నారు. రైతులు పండించే ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలుచేయాలని జిల్లా రైస్‌మిలర్ల సంఘ సభ్యులకు పౌరసరఫరాల అధికారులు సూచించారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.