అన్నను విస్మరించినందుకు గుండుగీయించుకుని నిరసన

విజయవాడ,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో దివంగత ముఖ్యమంత్రి  నందమూరి తారక రామారావుకు అవమానం జరిగిందని, సభల్లో ఎక్కడా అన్న ఫోటో పెట్టకపోవడం దారుణమని ఆలిండియా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు వడ్డెల్లి సాంబశివరావు తప్పుబట్టారు. తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఎన్టీఆర్‌ను తెలుగు మహాసభల్లో విస్మరించడం తగదని హితవు పలికారు. దీనికి నిరసనగా ఆంధప్రదేశ్‌-తెలంగాణ సరిహద్దు అయిన జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద జాతీయ రహదారిపై ఎన్టీఆర్‌ అభిమాని దుర్గంపూడి రాంబాబు గుండు గీయించుకుని నిరసన తెలిపారు. ఆయన్ని సాంబశివరావుతో పాటు పలువురు ఎన్టీఆర్‌ అభిమానులు, తెదేపా నేతలు సంఘీభావం తెలిపారు. అన్న వల్లనే తెలుగు జాతికి గుర్తింపు వచ్చిందన్నారు. ఆయన సిఎంగా ఉండగా
కెసిఆర్‌ మంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. అలాంటి అన్నను విస్మరించడం తగునా అని అన్నారు.

తాజావార్తలు