అన్ని జిల్లాల్లో ధర్మపోరాట సభలు – సీఎం చంద్రబాబు

– కేంద్రం తీరును ప్రజల్లో ఎండగట్టేలా సభల నిర్వహణ
– జగన్‌, గాలి జనార్దన్‌రెడ్డి కేసులను నీరుగాస్తున్నారు
– ఇదేనా అవినీతిని అంతమొందించే భాజపా పాలన
– ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టాలి
– ప్రతి గ్రామంలో పర్యటనలు చేయండి
– తెదేపా సమన్వయ కమిటీ భేటీలో నేతలకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు
అమరావతి, మే2( జ‌నం సాక్షి) : విభజనతో నష్టపోయిన ఆంధప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ‘నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలు’పై అన్ని జిల్లాల్లో ధర్మపోరాటానికి తెదేపా రంగం సిద్ధం చేసింది. తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం తెదేపా సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్తు కార్యాచారణపై సమాలోచనలు జరిపారు. ఇప్పటికే తిరుపతిలో జరిగిన ధర్మపోరాట సభ తరహాలోనే మరో 12చోట్ల భారీ సభలు నిర్వహించనున్నట్టు నేతలు వెల్లడించారు. ఈ నెలలోనే విశాఖలో ప్రారంభించి వచ్చే ఏడాది జనవరిలో చివరి సభను అమరావతిలో నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో తెదేపా గెలిచేలా ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలని సీఎం నేతలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో భాజపా వైఖరి ప్రస్తావన రాగా.. జగన్‌, గాలి జనార్దన్‌రెడ్డి కేసులు నీరుగారుస్తుండటం కేంద్ర ప్రభుత్వ నయవంచనకు నిదర్శనమని మండిపడ్డారు. ఇదేనా అవినీతిని అంతమొందించే భాజపా పాలన అని ఎద్దేవా చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, నేతలు పార్టీ కార్యకర్తల మధ్య ఉంటూ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, కేంద్రం ఏపీకి చేసిన అన్యాయం, వైకాపా కేంద్రానికి సహకరిస్తున్న తీరును ప్రజలకు వివరించాలని చంద్రబాబు ఆదేశించారు.  పార్టీకి నష్టం తెచ్చేలా నేతలు వ్యవహరించవద్దని, మరో ఏడాదిలో ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పార్టీ క్యాడర్‌ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, నియోజకవర్గాల వారీగా నేతలు పర్యవేక్షణ చేయాలన్నారు. తెదేపాను దెబ్బతీసేలా బీజేపీ, వైకాపాలు కలిసి ప్రయత్నాలు సాగిస్తున్నాయని, వారి కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి నేతలు పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయాలని చంద్రబాబు సమన్వయ కమిటీలో నేతలకు సూచించారు. సమావేశం అనంతరం  ఆ పార్టీ రాష్ట్రఅధ్యక్షుడు కళావెంకట్రావు విూడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల వరకు నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం కొనసాగించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ పోరాటాన్ని మొత్తం 13 జిల్లాల్లోనూ కొనసాగిస్తామని స్పష్టంచేశారు. జనవరి నెలలో అమరావతిలో భారీ సభతో కార్యక్రమం ముగిస్తామన్నారు. అనంతరం మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రజాప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్తు కోసం అంతా కలిసి పోరాటం చేయాల్సిన సమయంలో వైకాపా అసలు పోరాటాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం భాజపా డైరెక్షన్‌లో చేస్తోందని మండిపడ్డారు. చాలా దుర్మార్గమైన ధోరణితో వైకాపా కుట్ర రాజకీయాలు చేస్తూ రాష్ట్రభవిష్యత్తును ఫణంగా పెడుతోందని ఆరోపించారు. అలాగే, విజయవాడలో మహానాడు జరుపుకోవాలని కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
——————————————

తాజావార్తలు