అప్పన్న నిజరూప దర్శనంపై నేడు సవిూక్ష
విశాఖపట్టణం,మార్చి31(జనంసాక్షి): ఈ ఏడాది మే 9న సింహగిరిపై చందనోత్సవం జరుగనుంది. దీనికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా 1న కలెక్టర్ కార్యాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ యువరాజు, అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజున అందరికీ అప్పన్న స్వామి నిజరూప దర్శన భాగ్యం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయబోతున్నట్లు దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ ప్రకటించారు. గతంలో జరిగిన పొరపాట్లను అధ్యయనం చేసి తిరిగి అవి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈసారి చందనయాత్రను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చూస్తున్నారు. ఇందుకోసం వీఐపీల దర్శనాలతో పాటు సామాన్య భక్తులకు ఏ సమయాల్లో దర్శనాలు కల్పించాలన్న విషయంపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయిస్తారన్నారు. వీఐపీలతో పాటు రూ. 200, రూ. 500, రూ.వెయ్యి టిక్కెట్ల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. 2013, 2014 సంవత్సరాల్లో జరిగిన చందనయాత్రలతో పోల్చితే 2015లో జరిగిన చందనయాత్రలో కొన్ని సమస్యలు తలెత్తాయన్నారు. ఈసారి క్యూలైన్ల సంఖ్యను 60శాతం పెంచుతున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు సింహాచలం దేవస్థానం చేపట్టిన రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణం పనులు చందనయాత్ర నాటికి పూర్తి చేయనున్నట్లు ఇంజినీరింగ్ శాఖ అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల సంవత్సరం పాటు పనులు నిలిచిపోయాయి. తిరిగి ఆ పనులు ఇటీవల ప్రారంభించారు. చందనయాత్ర నాటికి కంకర వేసి రోలింగ్ చేసి వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తామన్నారు. 1.3 కిలోవిూటర్లు పొడవైన నిర్మాణం పూర్తయితే భక్తులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. హనుమంతువాక విూదుగా సింహాచలం కొండపైకి వెళ్లే వాహనదారులు గురుకుల పాఠశాల సవిూపం నుంచి తొలి ఘాట్‌రోడ్డు మధ్యలోకి చేరుకోవచ్చన్నారు. దీనివల్ల వాహనదారులకు 5కిలోవిూటర్ల దూరం తగ్గుతుందన్నారు. ఎన్టీఆర్ ఘాట్ సవిూపంలో గల కొండమలుపును విస్తరించే పనులు కూడా చేపడతామన్నారు. దీనివల్ల ఇక్కడ ప్రమాదాలకు ఇకపై ఆస్కారం ఉండదన్నారు.
—–