అభివృద్ది కార్యక్రమాలకు కోడెల శ్రీకారం
గుంటూరు,మే11(జనం సాక్షి ): గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం రోంపిచర్ల మండలంలోని వీరవట్నం గ్రామంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, సాగునీటి సంఘం భవనం ప్రారంభోత్సవంతో పాటు వేయవలసిన రోడ్లు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇదిలావుంటే నడికూడి- శ్రీకాళహస్తి రైల్వేమార్గం పనుల ప్రగతిపై సభాపతి కోడెల శివప్రసాదరావు ఆరా తీశారు. పట్టణంలోని తన కార్యాలయంలో రైల్వేశాఖ అధికారులతో ఆయన మాట్లాడారు. పిడుగురాళ్ల నుంచి రొంపిచర్ల వరకు ఇప్పటికే 85 శాతం మేరకు పనులు పూర్తయినట్లు అధికారులు ఈ సందర్భంగా వివరించారు. రొంపిచర్ల మండలంలోని గోగులపాడు, రామిరెడ్డిపాలెంలో భూసేకరణ సమస్య ఉండగా, దానిపై రెవెన్యూశాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. రెవెన్యూశాఖ అధికారులతో తాను మాట్లాడి భూ సేకరణలో సమస్య లేకుండా చేస్తానని, పనుల్లో వేగం పెంచాలని సభాపతి వారికి సూచించారు. నాణ్యతా ప్రమాణాలతో పనులు జరిగేలా చూడాలన్నారు. పల్నాడు ప్రాంత వాసుల కలను నూతన రైలుమార్గం నిర్మాణం ద్వారా నెరవేర్చుతున్నట్లు చెప్పారు. రైల్వే చీఫ్ ఇంజినీర్ పి.సూర్యబ్రహ్మానందం, డిప్యూటీ చీఫ్ ఇంజినీరు ముత్యాలనాయుడుతో సభాపతి మాట్లాడారు. ఈఈలు సుధాకర్, శైలేష్, గుప్తా, సుబ్బారావు పాల్గొన్నారు.
—————