అమరావతికి 58 వేల కోట్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రస్తుత అంచనాల ప్రకారం 58 వేల కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని భావిస్తున్నారు. ఇందులో 2017, 18, 19 సంవత్సరాలలో వౌలిక సదుపాయాల కల్పనకే 32 వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని సీఆర్డీయే అంచనాలు రూపొందించింది. ఈ నిధులను హడ్కో, ప్రపంచ బ్యాంక్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోపాటు ఇతర మార్గాల ద్వారా సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలో ఆవాస సముదాయాల నిర్మాణాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఇప్పటికే హడ్కో ముందుకొచ్చింది. ప్రపంచ నగరంగా రూపుదాల్చనున్న కొత్త రాజధానికి నిర్మాణ దశలో ఎలాంటి నిధుల కొరత రానివ్వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సూచనల మేరకు సీఆర్డీయే కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. బుధవారం సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తమ ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతిపాదనలలో మొదటిది పిపిపి పద్ధతిలో చేపట్టే ప్రాజెక్టుల ఆమోదం, పర్యవేక్షణకు ఓ సాధికార కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ పద్ధతిలో 5,500 కోట్ల రూపాయల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సమకూరుతాయని భావిస్తున్నారు.