అమరావతి..సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా కేసీఆర్..

ap-slide2

గుంటూరు : అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏపీ ప్రభుత్వం ఆయన్ను మిగిలిన వారికి భిన్నంగా గౌరవించింది. శంకుస్థాపనకు హాజరైన ప్రజలు కూడా.. కేసీఆర్‌ పేరు ప్రస్తావించినప్పుడు.. ఆయన ప్రసంగిస్తున్నప్పుడూ విశేషంగా స్పందించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం.. తెలుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావాన్ని చాటే వేదికగానూ కనిపించింది. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులిద్దరూ కలివిడిగా తిరగడం.. చూపరులను ఆకట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన వేదికకు వచ్చింది మొదలు.. ఈ ఇద్దరు నేతలూ.. ఆయన వెన్నంటే ఉన్నారు. గ్యాలరీని సందర్శించిన ప్రధానికి అధికారులు అక్కడి విశేషాలను వివరిస్తుంటే.. చంద్రబాబు.. కేసీఆర్‌తో ముచ్చట్లాడుతూ కనిపించారు.

సభలో ఈలలు..కేకలు..
అనంతరం.. శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరించేటప్పుడూ.. కేసీఆర్‌ పక్కకు వచ్చి నిలుచున్న చంద్రబాబు.. ఆయన భుజంపై చేయి వేసి నిలుచున్నారు. ఈ శిలాఫలకంలో కేసీఆర్‌ పేరునూ ప్రభుత్వం పొందుపరిచింది. కేసీఆర్‌ ప్రసంగానికి సమాయత్తమవుతున్నప్పుడు.. సభకు హాజరైన ప్రజలు ఈలలు, కేకలతో.. విశేషంగా స్పందించారు. వారి హర్షధ్వానాల మధ్యే కేసీఆర్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అమరావతి అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.  అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇద్దరు చంద్రుల కలయిక పట్ల.. సభా వేదిక నుంచే హర్షం ప్రకటించారు. చంద్రబాబు కేసీఆర్‌ ఇంటికే వెళ్లి శంకుస్థాపనకు ఆహ్వానించారన్న విషయం తెలిసి.. తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయని అన్నారు.

చివరి నిమిషంలో కేసీఆర్ ప్రసంగం..
ముందుగా నిర్ణయమైన షెడ్యూల్‌లో కేసీఆర్‌ ప్రసంగం లేదు. కానీ.. ఏపీ ప్రభుత్వం పిఎంఓతో చర్చలు జరిపి.. చివరి నిమిషంలో.. కార్యక్రమంలో కేసీఆర్‌ ప్రసంగాన్నీ చేర్చింది. మొత్తానికి మొన్నటి వరకూ ఉప్పూ నిప్పులా ఉన్న ఇద్దరు చంద్రులూ ఇలా కలివిడిగా కనిపించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇది రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి దోహద పడుతుందన్న భావనా వ్యక్తమవుతోంది.

 

తాజావార్తలు