అమిత్ షా కారుపై రాళ్లదాడి జరగలేదు
– స్పష్టం చేసిన డీజీపీ మాలకొండయ్య
విజయవాడ, మే12(జనం సాక్షి ) : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కారుపై రాళ్లదాడి జరగలేదని, కాన్వాయ్‌లో ఏడో వాహనంపై కర్రతో దాడి చేశారని డీజీపీ మాలకొండయ్య స్పష్టం చేశారు. దాడికి పాల్పడినవారిపై కేసు నమోదు చేసి, ఒకరిని అరెస్ట్ చేశామన్నారు. ఇరు పార్టీల ఫిర్యాదులతో కేసులు నమోద చేసి విచారణ కొనసాగుతోందన్నారు. తమ సిబ్బంది తప్పుంటే చర్యలు తీసుకుంటామని మాలకొండయ్య పేర్కొన్నారు. శుక్రవారం అమిత్‌షా తిరుమల పర్యటన ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. అలిపిరి వద్ద ఆయనకు ప్రత్యేక ¬దా సెగ తగిలింది. ప్రత్యేక ¬దా నినాదంతో టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ముందుకు రాగా పోలీసులు తరిమేశారు. ఈ క్రమంలో కాన్వాయ్‌లోని బీజేపీ నేత కారు అద్దం పగలడంతో బీజేపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. కాగా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం ఘటనకు సంబంధించి వివరాలను అందించాలని రాష్ట్ర పోలీస్‌శాఖను ఆదేశించింది. ఇదిలా ఉంటే స్థానిక బీజేపీ నేతలు సైతం తెదేపా ప్రభుత్వం, పోలీస్‌శాఖ తీరుపై మండిపడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు తిరపతికి వస్తే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంలో పోలీస్‌శాఖ విఫలమైందన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ నేతలు డీజీపీని కోరారు. ఇదిలా ఉంటే తెదేపా నేతలు సైతం బీజేపీపై మాటల దాడికి దిగారు.
————————-