అమెరికాలో చిత్తూరు యువకుడి మృతి
పుత్తూరు: చేతికి అందివచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. మరో మూడు మాసాల్లో ఎంఎస్ పూర్తి చేసుకుని స్వేదేశానికి తిరిగి వస్తాడనుకున్న కొడుకు ఇక లేడని తెలిసి ఆ కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు. అమెరికాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వడమాలపేట మండలం ఎస్‌బీఆర్ పురం గ్రామానికి చెందిన అడ్లూరు చంద్రశేఖర్‌రాజు, సుహాసిని దంపతుల కుమారుడు సాయికుమార్ మృతి చెందాడు. వీరికి ఇద్దరు కుమారులు సాయికుమార్, మోహన్‌వంశీ. పెద్ద కుమారుడు సాయికుమార్ చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఎంఎస్ చదువుకునేందుకు అమెరికా వెళ్లాడు. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం డెక్లాబ్ సీటీలోని ఇల్లినాయిస్ యూనివర్సిటీలో ఎం.ఎస్ చేస్తున్నారు. శనివారం స్నేహితుడి జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు కారులో వెళ్లాడు. అక్కడ వేడుకలు ముగించుకుని తన కారులో భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో యూనివర్సిటీకి బయలే దేరాడు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ సమీపంలో వెనుకవైపు వస్తున్న కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో సాయికుమార్ అక్కడి కక్కడే మృతి చెందాడు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అందివచ్చిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లాడని బోరున విలపించారు. విషయం తెలిసిన గ్రామస్థులు అక్కడకు చేరుకుని వారిని సముదాయించారు. అమెరికాలో ఉన్న తమ బంధువులకు విషయాన్ని తెలియ జేశారు. వారు సంఘటనా స్థలానికి బయలుదేరారు. మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చే విషయమై ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే సమాచారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలియజేశారు. ఈ మేరకు దిల్లీలో అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.
మూడు మాసాల్లోనే వచ్చేస్తున్నా అన్నాడు…
ఎంఎస్ పూర్తి చేసుకుని మూడు మాసాల్లో ఇండియాకు వచ్చేస్తున్నా నాన్న అని చెప్పాడని అంతలోనే ఇంతఘోరం జరిగిందని తల్లిదండ్రులు చంద్రశేఖర్‌రాజు, సుహాసిని దంపతులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు. వారిని ఓదార్చడానికి ఎవరి తరమూ కాలేదు. బాగా చదువుకుని ప్రయోజకుడు అవుతాడని ఆశించిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళిస్తుందని వూహించలేక పోయామని విలపించారు. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ సర్పంచి సుదర్శనరాజు తదితరులు ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు.