అలిపిరి పీఎస్‌ ఎదుట తెదేపా ఎమ్మెల్యే ధర్నా

– భారీ సంఖ్యలో స్టేషన్‌కు చేరుకున్న తెదేపా కార్యకర్తలు 
– అరెస్టు చేసిన తెదేపా నేతలను వదిలేసిన పోలీసులు
– పోలీసుల తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన భాజపా
తిరుపతి, మే12(జ‌నం సాక్షి) : భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పర్యటన తిరుపతిలో అలజడి రేపింది. శుక్రవారం స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతున్న అమిత్‌ షా కాన్వాయ్‌ పై దాడి చేశారనే ఆరోపణలతో ముగ్గురు తెదేపా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి నగర శాసనసభ్యురాలు సుగుణమ్మ శుక్రవారం రాత్రి నుంచి ఉదయం వరకు అలిపిరి పోలీస్‌స్టేషన్‌ వరకు ధర్నాకు దిగారు. కేంద్రం, రాష్ట్రంలోని ప్రతిపక్షం కుమ్మక్కై తెదేపాపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాయంటూ ఆరోపించారు. నగర తెదేపా శ్రేణులు మొత్తం అలిపిరి పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించటంతో కొన్ని గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అప్రమత్తమైన పోలీసులు తెదేపా కార్యకర్తలను విడుదల చేశారు. విభజన చట్టంలోని హావిూలు నెరవేర్చాలని శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై భాజపా శ్రేణులు ఉద్దేశపూర్వకంగానే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా ఛైర్మన్‌ నరసింహయాదవ్‌ మండిపడ్డారు. ఇదిలా ఉంటే తెదేపా నేతలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. అమిత్‌షాపై ఉద్దేశపూర్వకంగా దాడి చేసిన తెదేపా నేతలను కఠినంగా శిక్షించాల్సిందిపోయి వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమక్షణమే వారిని అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.
————————————————

తాజావార్తలు