అలుగు పారుతున్న చెరువులు మత్తళ్ళు దూంకుతున్న కుంటలు

శివ్వంపేట జూలై 21 జనంసాక్షి : ఈ యేడు వర్షాకాలం సీజన్ ప్రారంభమై 45 రోజులు గడిచిపోయిన సరైన వర్షాలు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతాంగానికి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల గత నాలుగు రోజులుగా నిర్విరామంగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండల పరిధిలోని అన్ని గ్రామాలతో పాటుగా మండల కేంద్రమైన శివ్వంపేట లో ఉన్న చెరువులు, కుంటలు అన్ని నిండుకుండలామారి అలుగు పారుతుంటే, కుంటలన్నీ మత్తళ్లు దూం కుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎండుముఖం పట్టిన పంటలకు ఈ వర్షాలతో కొత్త ఊపిరి పోసుకున్నాయి. రైతులు సాగుచేసిన వరి, మొక్కజొన్న, ఇతర కూరగాయ పంటలు పచ్చగా మారాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండల పరిధిలోని అన్ని గ్రామాలతో పాటుగా మండల కేంద్రమైన శివ్వంపేట లోని నివాస గృహాలన్నీ తడిసి ముద్దయ్యాయి. ఇప్పటివరకు మండల వ్యాప్తంగా 16 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నయని తహసీల్దార్ శ్రీనివాస్ చారి శుక్రవారం తెలిపారు. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 93.44 మిల్లి మీటర్లు, అలాగే గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 112.06 మిల్లి మీటర్ల వర్షం కురిసిందని తహసీల్దార్ వివరించారు. వర్షాల వల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, పాత ఇండ్లలో నివాసం ఉండవద్దని, ఆయన సూచించారు. కాచి చల్లార్చిన నీళ్లనే త్రాగాలని తహసీల్దార్ విజ్ఞప్తి చేశారు

తాజావార్తలు