అవసరమైన చోట్ల రక్షకతడులతో పంటకు రక్షణ
అనంతపురం,మే715(జనం సాక్షి): జిల్లాలో వేరుసెనగ రైతును ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో ఎక్కడా లేని తరహాలో రక్షక తడులు ఇచ్చే ప్రయత్నాన్ని ప్రారంభించారని మంత్రి స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఈ ఏడాది ప్రైవేటు ప్రొవైడర్స్‌ను ఏర్పాటు చేసి తడులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మంత్రులు, అధికారులతో చర్చించిన మేరకు రైతులకు సాయం అందిస్తామని అన్నారు. సాగునీటి సౌకర్యాన్ని మరింత పెంచడానికి చర్యలు చేపట్టామన్నారు. అనంతలో వర్షపాతం తక్కువగా ఉండటంతో వేరుసెనగ రైతు పూర్తిగా నష్టపోతున్నారు. రక్షక తడులు ఇవ్వాలని, రైతును కాపాడాలని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. జిల్లాలో నీటి లభ్యతపై రిజర్వాయర్లు, నీటి కుంటలు, వ్యవసాయ బోర్లు పరిగణలోకి తీసుకొని నమూనాను సిద్ధం చేశామన్నారు. ఆయిల్ ఇంజిన్లు, అవసరమైన పైపులను సిద్ధం చేస్తామని తెలిపారు. పట్టుసీమలో ఇప్పటికే 14 టీఎంసీలు నీరు నిల్వ చేశామన్నారు. హంద్రీనీవా కాలువను వెడల్పు చేయడానికి రూ.800 కోట్లు మంజూరు చేశామన్నారు. పనులు వేగవంతంగా సాగుతున్నట్లు తెలిపారు. పక్కా ప్రణాళికతో ఏజెన్సీల ద్వారా రక్షక తడులు ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నారన్నారు. సాంకేతికతతో తడులు ఇచ్చే విధానంపై అధికారులకు అవగాహన కల్పించారు.