అవినీతి కార్యకలాపాలపై బాబు సీరియస్..?
నేతల చిట్టాలో పదవులు పోగొట్టుకునే వారెవరో
విజయవాడ,ఏప్రిల్7(జనంసాక్షి): కొందరు మంత్రుల అవినీతిపై సిఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేవారిని సహించబోనని ఒకింత ఘాటుగానే హెచ్చరించారు. అవినీతి దూరంగా ఉండండి…ఇక ఏమాత్రం సహించేది లేదు…ఎవరేం చేస్తున్నారో తనకు తెలుసు అంటూ మంత్రుల ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్ ఇచ్చారు. టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం…అందరూ తెలుసుకుంటారనుకున్నా ఇకపై ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. ఓ వైపు తాను నవ్యాంధ్ర నిర్మాణానికి కష్టపడుతూ పెట్టుబడుల కోసం దేశాలు తిరుగుతంటే తనకు తోడుగా ఉండాల్సిన వారు కొందరు అవినీతిలో మునిగి ప్రభుత్వానికి అపఖ్యాతి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పాలనను గాడిన పెడుతున్నా తరువాత విూ వద్దకు వస్తానని చంద్రబాబు అల్టిమేటం ఇచ్చారు. తన మార్క్ ఏమిటో చూపిస్తానని, ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని సూచించారు. ప్రజలకు దగ్గరగా ఉంటేనే రాజకీయాల్లో ఉంటామని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియజేశారు. లేకుంటే చర్యలు తప్పవని ఘాటుగానూ సూచించారు. దీంతో ఎవరు ఉంటారు..ఎవరు పోతారన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. వైకాపా నుంచి దాదాపుగా వచ్చేవారు రావడంతో ఇక త్వరలోనే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. లోకేశ్ రావనడానికి టిడిపి నేతలు కూడా మానసికంగా సిద్దం కావడంతో లోకేశ్‌తో పాటు కొందరికి పీఠం వేయడం, మరికొందరికి ఉద్వాసన పలకడం జరగగలదని అంటున్నారు. ఆ కొందరు ఎవరన్నది ఇప్పుడు విజయవాడ నగరంతో పాటు, ఎపి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. లోకేశ్ రావాలంటూ ఇప్పుడు మంత్రులతో సహా అంతా ఎలుగెత్తి చాటడంతో బాబుకు కూడా సమస్య తీరిపోయిందనే చెప్పాలి. లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా వ్యతిరేకించే వారు దాదాపుగా లేనట్లే. అందుకే ఎపి కేబినేట్ లో మార్పులు , చేర్పులపై ఊహాగానాలు విన్పిస్తున్నాయి..త్వరలో కేబినేట్ ప్రక్షాళన చేస్తానని ఇప్పటికే సిఎం చంద్రబాబు సంకేతాలు పంపిన సంగతి తెలిసిందే..దీంతో మంత్రుల్లో కేబినేట్ ప్రక్షాళన ఆందోళన పట్టుకున్నట్లు టిడిపి నేతలు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.. ప్రాంతాలు, కులాలు వారీగా సవిూకరణాలు మారుతాయని భావిస్తున్నారు..ఆశావహుల్లో పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు, బండారు సత్యనారాయణమూర్తి, సంధ్యారాణి, కళావెంకటరావు, శివాజీ, ఎమ్మెల్సీ షరీఫ్, నక్కా ఆనందబాబులతో పాటు కొత్తగా వైసిపి నుంచి టిడిపిలో చేరిన భూమానాగిరెడ్డి, జలీల్ ఖాన్, జ్యోతుల నెహ్రూ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది..కోత పడే లిస్టులో పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావెల కిషోర్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, పీతల సుజాత, మృణాళిని , గంటాశ్రీనివాసరావు తదితరులున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వీరే ఖచ్చింతంగా ఉంటారని, ఫలానా వారే వస్తారని అనుకోవడానికి లేదు. సవిూకరణలో బాబు ఎవరికి ఓటేస్తారో, ఎవరిపై వేటేస్తారో ఇప్పుఊడే తెలియదు. ఇవన్నీ కూడా కేవలం చర్చల ద్వారా వస్తున్న ప్రతిపాదనలు మాత్రమే. వీరిలో పలువురికి ఉద్వాసన ఖాయమని, మరికొందరికి శాఖలు మారుస్తారని ప్రచారం జరుగుతోంది..జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలతో సన్నిహిత సంబంధాలు లేనివారి జాబితాలో దేవినేని ఉమా, పీతల సుజాత, అచ్చెన్నాయుడు పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. అయితే ఎవరు ఏంటన్నది ఉగాది తరవాత ఏ క్షణంలో అయినా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.