ఆంధ్ర- ఒడిశా సరిహద్దుల్లో ఆగని వేట!

slider59
వరుస కాల్పుల ఘటనలతో భయం.. భయం..
విశాఖపట్నం: క్షణ క్షణం.. భయం.. భయం.. అనుక్షణం ఉత్కంఠ.. ఇదీ విశాఖ మన్యంలో తాజా పరిస్థితి.. ఆంధ్ర- ఒడిశా సరిహద్దులోని మన్యాన్ని గ్రేహౌండ్స్‌ దళాలు జల్లెడ పడుతున్నాయి. కూంబింగ్‌ నిర్విరామంగా కొనసాగుతోంది. ఈనెల గురువారం నాటి ఘటనతో మూడు కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం.. మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య ఏకంగా 30కి చేరుకోవడంతో భవిష్యత్తులో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. గురువారం నాటి ఘటనలో కొందరు తప్పించుకున్నారని పోలీసు వర్గాలు చెబుతుంటే వీరికోసం వేట కొనసాగుతుందని అంటున్నారు.
అసలేం జరుగుతోంది..?
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో గత నాలుగు రోజులుగా ఏం జరుగుతుందో అంతుబట్టని పరిస్థితి నెలకొంది. తెల్లవారి నుంచి రాత్రి గడిచే వరకు ఎప్పుడు ఏ వార్త వినాల్సివస్తోందని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు.వరుస కాల్పుల ఘటనలతో సరిహద్దుల్లో రామగూడ అటవీ ప్రాంతంలో ఏం జరుగుతోంది.. మావోయిస్టులు- పోలీసుల యుద్ధానికి తెరపడుతుందా..? కొందరు తప్పించుకున్నారని.. మరికొందరు పట్టుబడ్డారనే ప్రచారాల నేపథ్యంలో మరిన్ని ఘటనలు వెలుగుచూసే అవకాశం ఉందా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగిన అనంతరం ఆ ప్రాంతం నుంచి మావోయిస్టులు పూర్తిగా సురక్షిత ప్రాంతానికి తరలివెళ్తారు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో భౌగోళిక నైసర్గిక స్వరూపం మీద పోలీసులు కన్నా మావోయిస్టులకు పూర్తిగా అవగాహన ఉంది. ఇంత పెద్ద ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత మావోయిస్టులు ఇంకా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నారా..? వారికి గాలింపులు జరుపుతున్న పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయా..? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. సోమవారం పోలీసులు దాడిచేసిన శిబిరంలో 50 మందికిపైగా మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్లు జరిగిన మూడు రోజుల్లో 30 మంది మావోయిస్టులు మృతి చెందగా, మిగిలిన వారు ఇక్కడికి సమీపంలోనే దాక్కుని ఉంటారనే అనుమానంతో భారీగా బలగాలు మోహరించి గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఆపరేషన్‌ ఇప్పట్లో ముగిసిందని చెప్పలేమనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఏది నిజం..?
మావోయిస్టులు మృతదేహాల కోసం ఒడిశాలోని మల్కన్‌గిరి వచ్చిన విరసం నాయకుడు వరవరరావు పోలీసులు ఇప్పటివరకూ 32 మంది మావోయిస్టులను హతమార్చినట్లు తెలుస్తోందని, దీనిపై స్పష్టమైన ప్రకటన పోలీసులు చెయ్యాలని డిమాండ్‌ చేశారు. గురువారం నాటి ఘటనతో ఈ వాదన నిజమేనా అనే మీమాంస నెలకొంది. సోమవారం నాటి ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కే పోలీసులకు చిక్కారనే అనుమానాలు ఆర్కే భార్య శిరీష, విరసం నేత వరవరరావు వ్యక్తంచేశారు. ఈ ఆరోపణలను విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ తోసిపుచ్చారు. సమావేశం నుంచి తప్పించుకున్న ఆర్కే పోలీసులకు చిక్కారా..? లేదంటే సరక్షిత స్థావరానికి వెళ్లిపోయారా? అన్న అంశంమీద ప్రస్తుతం చర్చంతా సాగుతోంది..

పాడేరు వైపు.. అందరి చూపు..
ఇన్నాళ్లూ ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం ఒడిశా పరిధి కావడంతో మృతదేహాలు మల్కన్‌గిరి వెళ్లాయి. తాజా కాల్పుల ఘటన ఆంధ్ర భూభాగంలో జరగడంతో మృతదేహాలను అనూహ్య రీతిలో పాడేరుకు తెచ్చారు. మృతదేహాలను తరలించేందుకు తొలుత ముంచింగిపుట్టు నుంచి రెండు అంబులెన్సులను ఒడిశా సరిహద్దులో ఉన్న ఇదే మండలంలోని బుంగాపుట్టు పంపారు. రహదారి మార్గంలో మావోయిస్టుల మృతదేహాలను తరలించడం శ్రేయష్కరం కాదని భావించిన పోలీసులు అప్పటికప్పుడు మూడు ప్రత్యేక హెలికాప్టర్లను వినియోగించారు. పాడేరు డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో సిబ్బంది రెండు మృతదేహాలను కూంబింగ్‌ బృందం నుంచి స్వీకరించి ప్రైవేటు వ్యానులో పాడేరు ఆస్పత్రికి తరలించి అక్కడ భద్రపరిచారు. దీంతో ఈ మృతదేహాల కోసం ఎవరు వస్తారనే ఆసక్తి అంతటా నెలకొంది.

 

తాజావార్తలు