ఆంబోతుల మాదిరిగి వ్యవహరిస్తే..
చూస్తూ ఊరుకోం
– అలాంటి వారు ప్రాణాల విూద ఆశలు వదులుకోవాల్సిందే
– దాచేపల్లి దుర్ఘటన మానవత్వానికే మాయని మచ్చ
– రేపటి ప్రజాచైతన్య ర్యాలీని విజయవంతం చేయాలి
– అత్యాచారాల నుంచి రాజకీయ లబ్ధిపొందాలని చూడటం హేయమైన చర్య
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
– రాష్ట్రంలో శాంత్రిభద్రతల పరిస్థితిపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
అమరావతి, మే5(జనం సాక్షి ) : దాచేపల్లి దుర్ఘటన మానవత్వానికే మాయని మచ్చ అని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారు ప్రాణాల విూద ఆశలు వదులుకోవాల్సిందేనని, ఆంబోతుల మాదిరిగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ప్రాణాలు పోతాయన్న భయం ప్రతి ఒక్కరిలోనూ కలగాలని
అధికారులకు స్పష్టం చేశారు. దాచేపల్లిలో దుర్ఘటన మానవత్వానికే మాయని మచ్చ అని.. ఈ దురాగతాన్ని ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు. రాష్ఠంలో శాంతి భద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఫోక్సో చట్టంలో సవరించిన నిబంధనలపై ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా కఠినంగా చట్టాలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. నిందితులు ఏ స్థాయివారైనా సహించేది లేదన్న సీఎం…. లైంగిక వేధింపులపైనా నిశ్శబ్దాన్ని ఛేదించాలన్నారు. అరాచకాలను ప్రతిఘటించాలని… ఆడపిల్లలు అబలలుగా కాకుండా సబలలుగా మారాలని సూచించారు. ఆడబిడ్డలకు రక్షగా…కదులుదాం పేరిట సోమవారం నిర్వహించే ప్రజా చైతన్య ర్యాలీని విజయవంతం చేయాలని.. మహిళలు, విద్యార్ధులు, ఉద్యోగులు అన్నివర్గాల వారు పాల్లొనాలని పిలుపునిచ్చారు. ఇది ఒక ప్రజా ఉద్యమమని… ఉన్మాదులపై పోరాటం కొనసాగించాలన్నారు. డ్వాక్రా మహిళలు, సాధికార మిత్రలు ప్రజలను చైతన్య పరచాలని… దాచేపల్లి దుర్ఘటనపై డాక్యుమెంటరీ రూపొందించాలని సూచించారు. అత్యాచారాల నుంచి రాజకీయ లబ్ది పొందాలని చూడటం హేయమని దుయ్యబట్టారు. తప్పుడు పనులకు, తప్పుడు రాజకీయాలకు పాల్పడితే సహించనని హెచ్చరించారు. నిందితుడి పార్టీ నేతలే విమర్శలు చేయడం విడ్డూరమని ఎద్దేవా చేశారు.