ఆత్మహత్యలపై విచారణ చేయాలి
అనంతపురం,అక్టోబర్26(జనంసాక్షి): ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో కొనసాగుతున్న ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపించాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి నాయకులు కోరారు. కార్పొరేట్ కళాశాలల్లో సరైన వసతులు లేకున్నా విచ్చలవిడిగా అనుమతులు మంజూరు చేస్తున్నారని సమితి వ్యవస్థాపకులు జి.నాగరాజు అన్నారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను సరిగా అమలు చేయకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వివరించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. చనిపోయిన ప్రతి విద్యార్థి కుటుంబానికి రూ.25లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కళాశాల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని విన్నవించారు.