ఆర్థిక మూలాలను దెబ్బతీసారు
రేషన్ షాపులను దెబ్బతీస్తే ఊరుకోం: మధు
విజయవాడ,నవంబర్2(జనంసాక్షి): నోట్ల రద్దు ప్రకటించిన నవంబర్ 8ని కేంద్రంలోని బిజెపి నల్లధన వ్యతిరేక దినంగా ప్రకటించినప్పటికీ, ఇది దేశ చరిత్రలో అతిపెద్ద ఆర్థిక కుంభకోణంగా నిలిచిపోతుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి మధు వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత ఏడాది చేపట్టిన పెద్ద నోట్ల రద్దు పక్రియ దేశ చరిత్రలోనే అతి పెద్ద ఆర్థిక కుంభకోణంగా నిలిచిపోతుందని అన్నారు. పెద్ద నోట్ల రద్దు పక్రియను నల్లధనంపై సర్జికల్ దాడి అని ప్రధాని మోడీ అభివర్ణిస్తున్నారని, అయితే వాస్తవానికి ఇది పారిశ్రామిక వేత్తలను మరింత ధనికులను చేయటమే కాక మిగిలిన దేశ ప్రజలను నిరుపేదలుగా మార్చిందని అన్నారు. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని, బ్యాంకింగ్ రంగం కూడా అదే స్థాయిలో దెబ్బతిన్నదని అన్నారు. దేశంలో మూలుగుతున్న మొత్తం నల్లడబ్బు తెల్లడబ్బుగా మారిపోయిందని అన్నారు. వ్యాపం కుంభకోణం, పనామా పత్రాల లీకేజి, బిజెపి అధ్యక్షుడి కుమారుడిపై వెల్లువెత్తిన ఆరోపణల వంటి కేసులు బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి చరిత్రను వెల్లడిస్తున్నాయన్నారు.
నెల 9న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేస్తారిని భావిస్తున్నామని అన్నారు. ఇదిలావుంటే రేషన్ షాపులను రిలయన్స్, ఫ్యూచర్స్ షాపులుగా మార్చొద్దని, ఉపాధి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో 29వేల రేషన్‌షాపులు ఉన్నాయన్నారు. వీటిలో 6,500 షాపులను తొలిదశలో రిలయన్స్‌కు, చంద్రబాబు కుటుంబ సభ్యుల వ్యాపార సంస్త ‘హెరిటేజ్’కు షేర్లు ఉన్న ఫ్యూచర్స్ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. ఇది పేదల పొట్టగొట్టే దుష్టపన్నాగమని ఆయన విమర్శించారు. రేషన్‌షాపు డాలర్లకు కవిూషన్ పెంచడానికి ఇష్టపడని ముఖ్యమంత్రి కార్పొరేట్లకు మాత్రం ప్రభుత్వం నుంచి రూ.200 కోట్లు, బ్యాంకుల నుంచి మరో రూ.200 కోట్లు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. ఉపాధి హావిూ కూలీలకు రూ.534 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. 5 నెలల నుంచి చంద్రబాబు ప్రభుత్వం వీటిని చెల్లించకుండా తాత్సారం చేస్తుందని విమర్శించారు. కూలీలు పనులు లేకుండా ఇబ్బందులుపడుతున్నారని, వారి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 8లక్షల పక్కా గృహాలకు నేటికీ బిల్లులు చెల్లించలేదని, దీని వల్ల ఇళ్లన్నీ సగంలోనే ఆగిపోవడంతో లబ్ధిదారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ మూడేళ్ల కాలంలో వివిధ ప్రాజెక్టుల వల్ల లక్ష మంది నిర్వాసితులయ్యారని, వీరికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలన్నారు.