ఆ దేవస్థానంలో బయోమెట్రిక్ విధానం..
కృష్ణా : విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో సిబ్బంది పని తీరులో మార్పులకు ఈవో చంద్రశేఖర్ ఆజాద్ శ్రీకారం చుట్టారు. ఉద్యోగులు, అర్చకుల్లోనూ పారదర్శకతను పెంపొందించేందుకు బయోమెట్రిక్ విధానానికి నాంది పలికారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ విధానం నేటి ఒకటి నుంచి అమలు చేయనున్నారు.
సిబ్బంది పనితీరులో మార్పు
దేవస్థానంలో బినామీ అర్చకులతో పనులు చేయిస్తున్నారని వస్తున్న ఆరోపణలకు ఈఓ చెక్ పెట్టారు. సిబ్బంది వచ్చిపోయే సమయాన్ని పూర్తిస్థాయిలో కంప్యూటీకరిస్తూ బయోమెట్రిక్ విధానాన్ని అమలుపరచనున్నారు. భక్తులకు విశేష సేవలందిస్తున్న సిబ్బంది సమయపాలనకు అద్దంపట్టేలా, అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఉద్యోగులను, అర్చకులను షిఫ్టుల వారీగా విధులు నిర్వహించే విధంగా ప్రస్తుత కార్యనిర్వాహణాధికారి ఏర్పాట్లు చేశారు.
ఇప్పటికే ఇంద్రకీలాద్రి పై మూడు బయోమెట్రిక్ మిషన్స్
ఇప్పటికే మూడు బయోమెట్రిక్ మిషన్స్‌ను ఇంద్రకీలాద్రి పైన, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. గతంలో అటు ఉద్యోగుల్లో ,ఇటు అర్చకుల్లో వర్గపోరు వల్ల దేవస్థానంలో ఆందోళనలు జరిగాయి. సిబ్బంది ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చేందుకు బయోమెట్రిక్ విధానం ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు. దేవస్థానం గొప్పతనానికి మచ్చ తేకుండా సిబ్బంది సరిగ్గా పనిచేయాలని భక్తులు కోరుతున్నారు. తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు సిబ్బందికి తగిన విధంగా కార్యాచరణ రూపొందించాలని అంటున్నారు.