ఆ నలుగురిలో ఒకరికే మేయర్ ఛాన్స్
కాకినాడ,సెప్టెంబర్1జనంసాక్షి): కాకినాడ పురపాలక ఎన్నికల్లో టిడిపి చారిత్రక విజయం సాధించడంతో ఇక మేయర్ ఎవరన్నది అప్పుడే చర్చ మొదలయ్యింది. ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టడంతో ఇప్పుడు మేయర్ ఎవరనే విషయంపై నేతలు దృష్టిసారించారు. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకొనేందుకు అవసరమైన మెజార్టీని సొంతంగానే సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మేయర్ పీఠాన్ని కాపు వర్గానికే కేటాయిస్తామంటూ గతంలో తెదేపా నాయకత్వం ప్రకటించడంతో ఎవరిని ఆ పీఠంపై కూర్చోబెడతారనే అంశంపై చర్చ జరుగుతోంది. కాకినాడ నగర మేయర్ బరిలో శేషకుమారి, అడ్డూరి లక్ష్మి, సుంకర పావని, సుంకర శివప్రసన్న ఉన్నట్టు సమాచారం. మేయర్ ఎంపికపై తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాకినాడ పురపాలక సంస్థలో మొత్తం 48 డివిజన్లకు గాను తెదేపా కూటమి (తెదేపా 32, భాజపా 3) స్థానాల్లో గెలుపొందగా, ప్రతిపక్ష వైకాపా అభ్యర్థులు 10 స్థానాల్లో విజయం సాధించారు. ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు. 30 ఏళ్ల సుదర్ఘీకాలం తర్వాత కాకినాడ మేయర్ పీఠాన్ని తెదేపా సొంతం చేసుకుంది. నంద్యాల ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన తెదేపాకు ఈ ఎన్నికల్లోనూ అపూర్వ విజయాన్ని ప్రజలు కట్టబెట్టడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.