ఇతర రాష్టాల్రకు ఆదర్శంగా రుణమాఫీ: సోమిరెడ్డి

నెల్లూరు,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రుణమాఫీ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… 10శాతం వడ్డీ కలిపి రూ.3600 కోట్లు రైతులకు అందిస్తున్నామన్నారు. తర్వాత రెండు విడతల్లో వడ్డీతో సహా రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తామని మంత్రి అన్నారు. ఇతర రాష్టాల్ర వారు ఏపీలో రుణమాఫీపై అధ్యయనం చేస్తున్నారని అన్నారు. అయితే ఏపీలో కరువు రావాలని,వర్షాలు పడొద్దని ప్రతిపక్ష నేతలు కోరుకున్నారని, కానీ దేవుని కరుణతో ఏపీలో డ్యామ్‌లన్నీ నీటితో కళకళలాడు తున్నాయన్నారు. అలాగే… భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి సోమిరెడ్డి అన్నారు. ఇదిలావుంటే రాష్ట్ర ప్రభుత్వ మూడో విడత రుణమాఫీ నిధులు విడుదల చేయడంతో జిల్లాలోని లక్షలాది మంది రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. తాజాగా మూడో విడత మాఫీకి సంబంధించి దాదాపు నెలక్రితమే ఏర్పాట్లు చేసినప్పటికీ ఆదిశగా అడుగులు ఇప్పుడు పడ్డాయి. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్‌ సాగులేక దిగాలుగా ఉన్న లక్షలాది మంది రైతులకు రాష్ట్రముఖ్యమంత్రి అందించిన రుణమాఫీ ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది. జిల్లాలో ప్రస్తుతం మూడో విడతలో 1,93,000 మంది రైతులకు రూ.186.39 కోట్లు రుణమాఫీ చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటికి సంబంధించిన ఉపశమన పత్రాలు జిల్లా మంత్రులు గూడూరులో రైతులకు అందించారు. ఐదు విడతల్లో అంతా కలిపి రూ.1012 కోట్లకు పైగా రుణమాఫీ చేయాల్సి ఉంది. ఈ పక్రియను ప్రభుత్వం ఐదు విడతలుగా చేపడుతున్న నేపథ్యంలో తొలి విడతలో రూ.50 వేల లోపు రుణం తీసుకున్న రైతులకు అందజేశారు. తరువాత రూ.1.50 లక్షలు మొత్తం రుణాలకు సంబంధించి అయిదు విడతల్లో అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో కొందరు రైతులకు రుణ విమోచన పత్రాలను విడుదల చేయాల్సి ఉంది.

తాజావార్తలు