ఇది పండుగ సమయం కాదు

స్వరాష్ట్రం కోసం యువత

ఉరికొయ్యపై వేలాడుతున్న వేళ

సీమాంధ్ర పెట్టుబడీదారుల కారుకూతలకు

విద్యార్థులు ఆత్మాహుతికి పాల్పడిన సందర్భం

ఇన్ని రోజుల పోరాటం

వృథా అవుతుందేమోననే ఆవేదన

ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడూ

ప్రత్యేక రాష్ట్రం సాధించలేమనే తెగింపు

ఎందరో బిడ్డలను శవాలగదికి చేర్చింది

పెళ్లి భాజా మోగాల్సిన ఇండ్లలో

చావు డప్పు సప్పుడు ప్రతిధ్వనించింది

బిడ్డలను కోల్పోయిన తల్లులెందరో

వాళ్లను యాది చేసుకుని ఎడుస్తున్నరు

అన్నలను కోల్పోయిన చెల్లెలు, తమ్ముళ్లు

పెద్దదిక్కు కోసం దిక్కులు చూస్తున్నరు

ఇలాంటి సందర్భంలో ఎలా చేసుకుందాం

నూతన సంవత్సర వేడుకలను..?

ఢిల్లీ నడి వీధుల్లో

రెచ్చిపోతున్నరు కామాంధులు

ఆడది కనిపించగానే

మారిపోతున్నరు దున్నపోతున్నల్లా

మనుషులమనే విషయం మరిచి

ప్రవరిస్తున్నరు పశువుల్లా

వారి కీచక పర్వానికి బలై

యాతన అనుభవించి మరణించిన ఆమె

మన స్మృతి పథంలో ఉండగానే

ఎలా జరుపుకుంటాం ‘నూతన’ పండుగను..?

వారికి నివాళులర్పిస్తూ..

‘జనంసాక్షి’ నూతన వేడుకలను బహిష్కరిస్తోంది

తెలంగాణ ప్రజలందరినీ

తనతో కలిసి నడవమంటోంది.