ఇసుక మెటలతో, నీట మునిగిన పంటలను సర్వే చేసి రైతులకు నష్ట పరిహారం అందించాలి – స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లి నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
జనంసాక్షి , మంథని : అధిక వర్షాలు, బ్యాక్ వాటర్ తో పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని చిన్న ఓదెల, పెద్ద ఓదెల, గోపాల్ పూర్ గ్రామములో మానేరు వాగు వల్ల ఇసుక మేటలు వేసిన పొలాలను రైతులతో కలిసి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం పరిశీలించారు. వరద నీటిలో తానే స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లి నీట మునిగిన, ఇసుక మేటలతో నష్టపోయిన పంటలను శ్రీధర్ బాబు పరిశీలించారు. ఏడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, నీట మునిగిన వెంటనే పంటలను జాయింట్ సర్వే చెప్పట్టి రైతులకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని శ్రీధర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతుల సమక్షంలో జిల్లా కలెక్టర్, మంథని ఆర్డీవో, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు రైతులను ఆదుకోవాలని కోరారు. శ్రీధర్ బాబు వెంట కిసాన్ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, కౌన్సిలర్ పెండ్రు రమరెడ్డి, నాయకులు శశి భూషణ్ కాచే, నాగుల రాజయ్య, ఓడ్నాల శ్రీనివాస్ రాజమల్లు, కాంగ్రెస్ నాయకులు, రైతులు, తదితరులు ఉన్నారు.