ఈ నెలాఖరులోగా పుష్కర పనులు పూర్తి!


ఏపీ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
విజయవాడ: ప్రస్తుతం పుష్కర పనుల్లో భాగంగా నిర్మిస్తున్న ఘాట్‌లన్నీ శాశ్వత ప్రాతిపదికన చేపట్టినవేనని ఏపీ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం ఆయన అన్ని శాఖలు, విభాగాలకు చెందిన అధికారులతో పుష్కర పనులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విజయవాడలోని కృష్ణాతీర ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ పనులు చేస్తున్నామని స్పష్టం చేశారు. కృష్ణా రివర్‌ ఫ్రంట్‌లో భాగంగా నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో పొడవైన ఘాట్‌లను నిర్మిస్తున్నామని చెప్పారు. ఈనెలాఖరు నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. గోదావరి హారతి తరహాలోనే కృష్ణాహారతిని పవిత్ర సంగమం వద్ద నిర్వహిస్తామని తెలిపారు. పులిచింతల వద్ద రెండున్నర టీఎంసీల నీటిని నిల్వ ఉంచామని అత్యవసర పరిస్థితుల్లో ఈ నీటిని వినియోగించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమంలో భక్తులు మూడు రకాల పవిత్ర స్నానాలు ఆచరించే అవకాశం ఉందని వివరించారు. కృష్ణానది నీటితో పాటు పోలవరం కుడి కాల్వ ద్వారా వచ్చే గోదావరి నీళ్లు అలాగే, రెండు నదులు కలిసిన పవిత్ర జలంలోనూ పుణ్య స్నానాలు ఆచరించేలా ఏర్పాటు చేశామని వెల్లడించారు.

తాజావార్తలు