ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు
గుంటూరు (మెడికల్): సాహీ స్వచ్ఛంద సంస్థ నవ్యాంధ్రలో ఏడేళ్లలోపు చెవిటి, మూగ ఆడ పిల్లలకు రూ.8 లక్షల విలువైన కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, సాహీ కార్యదర్శి డాక్టర్ ఈఎస్ వినయకుమార్ తెలిపారు. సెయింట్ జోసఫ్స్ ఆస్పత్రిలో ఆదివారం సాహీ సంస్థ ఆధ్వర్యంలో ఆస్పత్రి చెవి, శ్రవణ సంరక్షణ విభాగం సౌజన్యంతో కాక్లియర్ శస్త్రచికిత్సల ప్రారంభోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. ఆస్పత్రి అడ్మినిసే్ట్రటర్ సిస్టర్ క్లీటస్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో వినయకుమార్ మాట్లాడుతూ పుట్టుకతోనే వినిడిలోపం ఉన్న పిల్లలు మాట్లాడలేక మూగగా మారతారని, ఈ లోపాన్ని వెంటనే గుర్తించి తగిన చికిత్సలు చేయిస్తే చిన్నారులు చక్కగా మాట్లాడగలరని ఆయన తెలిపారు. కాక్లియర్ ఆపరేషన్లు ఖరీదవ్వడం వల్ల చాల మంది తల్లిదండ్రులు ఆర్థిక స్తోమత లేక ఆపరేషన్లు చేయించేందుకు ఆసక్తి చూపడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుక్త వయస్సుకు వచ్చాక ఇలాంటి ఆడ పిల్లలకు పెళ్లిళ్లు కావడం కష్టమని, వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతారని తెలిపారు. వీటిని దృష్టిలో ఉంచుకొని సాహీ సంస్థ ద్వారా 200 మంది ఆడపిల్లలను కాక్లియర్ ఆపరేషన్ల కోసం ఎంపిక చేశామని, వీరికి రూ.8 లక్షల విలువైన సర్జరీ ఉచిత ంగా చేస్తామని పేర్కొన్నారు. నవ్యాంధ్రలో తొలిసారిగా గుంటూరులో ఈ స్ర్కీనింగ్ శిబిరం ఎంపిక చేశామని ఆయన తెలిపారు. ఉచితంగా కాక్లియర్ ఆపరేషన్లు పొందదలచిన వారు తమ హెల్ప్‌లైన్ (సెల్ ఫోన్ నెంబరు: 93938 84400)ను సంప్రదించాలని ఈన్‌ఈ సర్జన్ డాక్టర్ సుబ్బారాయుడు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డాక్టర్ గాలిబాలి, డీఎంహెచ్‌వో డాక్టర్ టీ పద్మజారాణి, ఆడియాలజిస్ట్‌లు టీ నరేంద్ర, శ్రీనివాసరావు, సిస్టర్ విక్టోరియా తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైద్య శిబిరంలో 100 మంది చిన్నారులకు వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వినయకుమార్ రూ.5.50 లక్షల విలువైన ఆటో ఎకాస్టిక్ టెస్టింగ్ మెషిన్‌ను సెయింట్ జోసఫ్స్ ఆస్పత్రికి విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు.