ఉచిత విద్యుత్‌ పథకం దెబ్బతీసేందుకు కుట్ర

వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం
2011 జనాభా లెక్కలు సరికాదు
ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ
అమరావతి,మే7(జ‌నం సాక్షి):  అన్నదాతలను ఆదుకునేందుకు అమలు చేస్తున్న ఉచిత విద్యుత్‌ పథకాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం విధి విధానాల్లో పేర్కొన్న ‘జనాకర్షక పథకాలపై సవిూక్ష’ అనే అంశం అభ్యంతరకరమని ఆయన లేఖలో పేర్కొన్నారు. విద్యుత్‌ చట్టం- 2003కు సవరణ ప్రతిపాదించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కూడా రాష్టకరాలు  ఉచిత విద్యుత్‌ ఇవ్వకుండా కేంద్రం ఒత్తిడి చేసేలా ఉందని అభిప్రాయపడ్డారు. విద్యుత్‌ చట్టానికి సవరణలు చేయాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని ముఖ్యమంత్రి లేఖలో కోరారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించే విధానం రైతుకు మేలు చేసేలా ఉండాలని పేర్కొన్నారు. ఏపీలో వరి సాగు ఖర్చు హెక్టారుకు 1.08లక్షలు అవుతోందని, క్వింటాలుకు 1702 రూపాయలు సాగు ఖర్చు అవుతుందని వివరించారు. సాగు ఖర్చు రూపాయి అయితే మద్దతు ధర 83 పైసలుగా ఉండటాన్ని ఆయన తప్పుబట్టారు. వరితో పాటు అన్ని పంటలకు మద్దతు ధర నిర్ణయించాలని సూచించారు. పంటల బీమా నిబంధనల్లో పలు మార్పులు అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రైతులు తమ దగ్గర తీసుకున్న రుణాల వివరాలను జాతీయ పంట బీమా పోర్టల్‌లో నమోదు చేయాలని బ్యాంకులకు విధించిన నిబంధనతో అనేక ఇబ్బందులు వస్తున్నాయని చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.. జనాభా నియంత్రణలో కేరళ ముందుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఉన్నట్టుండి జనాభాను తగ్గించడం సాధ్యంకాదన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…అంతిమంగా అందరి లక్ష్యం పేదరిక నిర్మూలనేనని, పేదరిక నిర్మూలన కోసం అనేక విధానాలు తీసుకొస్తున్నామని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నిధులు కేటాయిస్తామంటే రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. ఏపీకి రావాల్సిన నిధులు ఇచ్చారే తప్ప…విభజన వల్ల నష్టపోయిన రాష్టాన్రికి అదనంగా ఏవిూ ఇవ్వలేదన్నారు. అందుకే ఏపీ ఇంకా లోటు బ్జడెట్‌లోనే ఉందని సీఎం పేర్కొన్నారు. హేతు బద్ధతలేని విభజన వల్ల తీవ్రంగా నష్టపోయాం. ఇబ్బందులున్నా సంక్షోభాలను అవకాశాలుగా మలచుకున్నాం. వృద్ధిరేటును పెంచుకుంటూ పోతున్నాం. పారిశ్రామిక, సర్వీస్‌ రంగాల్లోనే ఆదాయం అధికంగా వస్తోంది. అన్ని రాష్ట్రాల్లో  వనరులు పుష్కలంగా ఉన్నాయి. వనరులను సమర్థంగా వినియోగించుకున్న రాష్టాల్రు అభివృద్ధి చెందుతున్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎంను కుదించాలన్న కేంద్రం ఆలోచన సరికాదు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

తాజావార్తలు