ఉత్తరాంధ్రలో జోరుగా వర్షాలు
– జలమయమైన ప్రధాన రహదారులు
– నేలకొరిగిన మొక్కజొన్న, అరటి పంటలు
– అన్నదాతకు తీవ్రనష్టం
– మరో రెండు రోజులు ఇదేపరిస్థితి
విశాఖపట్టణం, మే3(జనం సాక్షి) : ఏపీని అకాల వర్షాలు ముంచెతుత్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో ఇప్పటికే గత రెండు రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో రహదారులన్నీ జలమయంగా మారుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. మరో వైపు ఈదురుగాలులలో ఇప్పటికే భారీస్థాయిలో రైతులు సాగుచేసిన పంటలకు నష్టం వాటిల్లింది.. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారు జామున ఈదురుగాలులతో కూడిన వర్షంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్ధితుల నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా గురువారం తెల్లవారుజాము నుంచే ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలైనా జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని పలు గ్రామాల్లో కురిసిన వర్షాలతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. బలిజిపేట, మెరకమూడిదాం, మెంటాడ, డెంకాడ మండలాల్లో కూడా ఓ మోస్తారు వర్షం కురిసింది. విజయనగరంలో తెల్లవారుజాము నుంచే ఆకాశం మేఘలతో కమ్ముకొని చీకటిని తలపించింది. ఉదయం నుంచే పట్టణంలో వర్షం కురుస్తోంది. మున్సిపల్ కూడలి, పద్మావతి నగర్, ఊడాకాలనీ, దాసన్నపేట రైతు బాజరు ప్రాంతాలు పల్లపు ప్రాంతాలు కావడంతో వర్షపు నీరు రోడ్ల పైకి వచ్చి ప్రవహిస్తోంది. గూడ్ షెడ్ ప్రాంతంలో వర్షం నీరు నిల్వ ఉండడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో
వర్షాలు పడుతున్నాయి. భీమిలి, తగరపువలస, పద్మనాభం, ఆనందపురంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈదురుగాలులకు మొక్కజొన్న, అరటి తోటలు దెబ్బతిన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం, పాలకొండ, రాజాం, టెక్కలిలో వర్షం పడింది. బెంగాల్‌పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. మరో రెండ్రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.