ఉప్పొంగిన ఎర్రవాగు రాకపోకలకు అంతరాయం.
బెల్లంపల్లి, జులై 21, (జనంసాక్షి )
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని ఎర్రవాగు ఉప్పొంగి పోయింది. ఎర్రవాగు ఉప్పొంగి పోవడంతో నెన్నెల మండల కేంద్రానికి చిన్న లంబాడి తండా, పెద్ద లంబాడి తండా, కుర్మ గూడెం, మన్నెగూడెం, గొల్ల గూడెం, కోణంపేట, పాటి, భోగం పల్లి, జంగాల్ పేట, ఖర్జీ, దమ్మిరెడ్డి పేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రవాగు కాజ్ వే పై నుంచి ప్రవాహం రావడంతో ఎస్సై శ్యామ్ పటేల్ తన సిబ్బందితో ఎర్రవాగు వద్దకు చేరుకొని ముందస్తుగా రాకపోకలను నిలిపి వేశారు. లంబాడి తండా యువకుల సహాయంతో ప్రవాహానికి కొట్టుకు వచ్చిన ఎండిన చెట్లు, చెత్తా, చెదారం తొలగింపజేశారు. ఈసందర్భంగా ఎస్సై శ్యామ్ పటేల్ మాట్లాడుతూ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని సూచించారు. కరెంటు స్థంబాల వద్ద, పాత ఇండ్లు, గోడల సమీపంలో ఉండవద్దని, అలా ఉండటం వల్ల ప్రమాదాలకు కారణం అవుతుందన్నారు. ప్రయాణాలు చేసేవారు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణం చేయాలని, తప్పనిసరి కాకపోతే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలన్నారు. భారీ వర్షాల కారణంగా రోడ్లు, వంతెనలు నిలిపి వేయడం వల్ల ప్రయాణలు చేసేవారు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. తహసీల్దార్ భూమేశ్వర్, గిర్థవర్ గణేష్ ఎర్రవాగును సందర్శించి ప్రవాహాన్ని అంచనా వేశారు. ప్రవాహం ఉన్నప్పుడు వాగు దాటావద్దని తహసీల్దార్ సూచించారు. భారీ వర్షాల కారణంగా నెన్నెల మండల కేంద్రంలోని తోట తిరుపతి ఇంటి గోడలు కూలిపోయాయని, పాత ఇళ్లలో ఎవరు ఉండవద్దని తహసీల్దార్ సూచించారు.