ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలు

ముందస్తు చర్యలకు అధికారుల ఆదేశాలు
అనంతపురం,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువ ఉండడంతో ఉపశమన చర్యలను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలోని అన్ని
శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా ఉపాధి కూలీలు ఎండలో దెబ్బతినకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.  ఎండల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండల్లో ఎలాంటి పనులు చేయరాదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామాల్లో దండోరా వేయించారు. ఉపాధి హావిూ కూలీల పని వేళల్లోనూ మార్పులు చేయమని చెప్పారు.  ప్రధాన కూడళ్లు, జన సమూహం ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను విరివిగా పంపిణీ చేయాలని చెప్పారు. ఇదిలావుంటే జిల్లాలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. మరో ఐదు రోజుల పాటు ఇంచుమించుగా ఇదే ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా క్షేత్రం శాస్త్రవేత్తలు తెలిపారు. జిల్లాపై భానుడు పగబట్టాడా అన్నంతగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సూరీడి భగభగలతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. సాధారణంగా ఏప్రిల్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం మే నెలలో మరో రెండు మూడు డిగ్రీల పెరుగుదల కనిపించేంది. ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. ఏప్రిల్‌లో జిల్లాలో చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

తాజావార్తలు