ఎన్నికల సంఘం అనుమతితోనే బెంగళూరులో సమావేశం
– బీజేపీ నేతలకు అప్పుడు రూల్స్ గుర్తుకు రాలేదా?
– ఏపీ ఎన్జీవోల సంఘం నేత అశోక్‌బాబు
విజయవాడ, మే8(జనం సాక్షి) : ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎన్జీవోల మద్దతు కోరినప్పుడు బీజేపీ నాయకులకు అప్పుడు రూల్స్ గుర్తుకు రాలేదా..? అంటూ ఏపీ ఎన్జీవోల సంఘం నేత అశోక్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ… నేను బెంగళూరులో ఏర్పాటుచేసిన సమావేశంపై విమర్శలు సరికాదన్నారు. ఎన్నికల సంఘం అనుమతితోనే సమావేశం నిర్వహించామన్నారు. మోడీ ప్రభుత్వం వల్ల ఏపీకి ఎలాంటి నష్టం జరుగుతుందో మాత్రమే చెప్పామని, ఎవరికి ఓటువేయాలో, ఎవరికి ఓటు వేయకూడదో ఎక్కడా మేము చెప్పలేదన్నారు. ‘రూల్స్ గురించి మాకు తెలుసు.., మరొకరు మాకు చెప్పాల్సిన పనిలేదన్నారు. చౌకబారు విమర్శలు మానుకుంటే మంచిది…’ అని ఆయన అన్నారు. ఏ పార్టీకి అనుకూలం తాము అనుకూలం కాదని, ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్నే తెలియజేస్తున్నామన్నారు. నేరుగా ఉద్యమాలు చేద్దామంటే పరిపాలనకు ఇబ్బందొస్తుందని ఉద్యమాలు చేయడం లేదన్నారు. ప్రధాని మోదీ పాలన బీజేపీ, నాన్ బీజేపీ అన్న విధానంలో నడుస్తోందని పేర్కొన్నారు. టీడీపీ తరపున బెంగళూరు పర్యటనకు వెళ్లలేదని తెలిపారు. ఏపీ హక్కుల సాధన సమితి నుంచి 150 మంది వెళ్లామన్నారు. ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని అశోక్‌బాబు ప్రకటించారు.
——————————