ఎపిలో నత్తనడకన పనులు
కాగి నివేదికలో వెల్లడి
హైదరాబాద్,మార్చి30(జనంసాక్షి): ఏపీలో స్టాంప్స్‌డ్యూటీలో అవకతవకలతో ప్రభుత్వానికి రూ.9.85 కోట్ల నష్టం వాటిల్లిందని ఏపీ కాగ్ రిపోర్టులో తేలింది. రవాణాశాఖలో పన్నుల అవకతవకలతో రూ.7.09కోట్ల నష్టం వచ్చిందని కాగ్ పేర్కొంది. సరైన భూమి శిస్తు విధానం లేకపోవడంతో రూ.76.11 కోట్ల నష్టం వచ్చిందని ఆరోపించింది. కాగ్ నివేదికను బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. పరిశ్రమలు, వాణిజ్యం, విద్యుత్ శాఖల్లో రూ. 749.60 కోట్ల అవినీతి, ఆబ్కారీ శాఖలో రూ.5.76 కోట్ల అవకతవకలను కాగ్ గుర్తించింది. రెవెన్యూ బకాయిలపై ఆందోళన వ్యక్తం చేసిన కాగ్ 2015 మార్చి 31 వరకు 8,960.12 కోట్ల బకాయిలను గుర్తించింది. 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసిన రెవెన్యూ 38,038.22 కోట్లు అని తేల్చింది. రెవెన్యూ లోటును తప్పుగా చూపించారంటూ కాగ్ కీలక
ఆరోపణలు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్ నివేదికలో పేర్కొన్న అంశాలు పరిశీలిస్తే 2014-15లో రెవెన్యూ లోటు రూ.24,194 కోట్లు, ద్రవ్యలోటు రూ.31,717 కోట్లు గా చూపింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం సూచించిన 3శాతం పరిమితికి రెట్టింపు లోటు ఉంది. మొత్తం 6.10శాతం లోటు నమోదైందని కాగ్ నివేదిక వెల్లడించింది. శాసనపరమైన సాధికారిత లేకుండా రూ.13,134. 68 కోట్లు అదనపు వ్యయం చేశారని వెల్లడించింది. రాష్ట్రప్రభుత్వం ఆర్థిక సంస్కరణ లక్ష్యాలను సాధించలేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఎఫ్‌ఆర్బీఎమ్ చట్టం సూచించిన 3 శాతం పరిమితిని మించి ద్రవ్యలోటు ఉందని వెల్లడించింది. రూ. 31,712 కోట్లతో ద్రవ్యలోటు 6.10 శాతానికి చేరిందని తెలిపింది. గత ఎనిమిదేళ్లు వరుసగా మిగులు సాధించిన రాష్ట్రంలో 2014-2015 లో మాత్రం రూ. 24,194 కోట్ల రెవెన్యూలోటు నమోదైందని చెప్పింది. బకాయిలు కూడా ఎఫ్బీఆర్‌ఎమ్ చట్ట పరిమితిని మించి ఉన్నాయని తెలిపింది. 2015 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు రూ. లక్షా 66 వేల 580 కోట్లు అని పేర్కొంది. తాగునీరు, రహదారులు, నిర్మాణ పనులు నిధానంగా సాగుతున్నాయని పేర్కొంది. అలాగే రాష్ట్రంలో అసంపూర్తి ప్రాజెక్టు పనుల వల్ల స్తంభించిన నిధులు రూ. 32,646 కోట్లు అని కాగ్ వెల్లడించింది.