ఎపి అసెంబ్లీలో బిజెపి విపక్ష పాత్ర?

అమరావతి,నవంబర్‌7(జ‌నంసాక్షి): వైకాపా అసెంబ్లీ బహిష్కరణ పిలుపుతో మిత్రపక్షంగా ఉన్న బిజెపి ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలని యోచిస్తోంది. సమస్యలపై సభలో ప్రస్తావిస్తామని, వాటిపై చర్చిస్తామని బిజెపి శాసనసభాపక్షనేత విష్ణుకుమార రాజు అన్నారు. వైకాపా లేకపోయినా వచ్చే లోటు లేదన్నారు. మరిన్ని సమస్యలను ప్రస్తావించే అవకాశం రానుందన్నారు. అధికార పక్షంతో ఉన్నా సమస్యలను ప్రస్తావించడంలో గతంలోనూ తాము నిర్మాణాత్మక పాత్ర పోషించామని ఆయన అభిప్రాయ పడ్డారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం లేదనే సమస్య ఉత్పన్నం కాదని తెలిపారు. ఇప్పటికే బిజెపి తరుపున నలుగురు సభ్యులున్నారని, వారూ ప్రతిపక్షమేనని మంత్రి యనమల అన్నట్లు తెలిసింది.అనేక బిల్లులు ప్రవేశపెడుతున్నామని, వాటన్నిటిపైనా సుదీర్ఘంగా చర్చ జరపాలని, రోజంతా సమావేశాలు జరిగే విధంగా చూడాలని సిఎం సూచించారు. కీలకమైన అంశాలపై చర్చించడం ద్వారా ఆయా అంశాల్లో ప్రతిపక్ష పాత్రను ప్రజలు ప్రశ్నించే విధంగా వ్యవహరించాలని, దీని బాధ్యత యనమల చూసుకుంటారని చెప్పినట్లు సమాచారం. ఇకపోతే ఈ నెల 10నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షం హాజరు కానందువల్ల వచ్చే నష్టమేవిూ లేదని టిడిపి నేతలు కూడా భావిస్తున్నారు. ప్రతిపక్షం బహిష్కరించి సమస్యలనుంచి పారిపోయిందని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. సమస్యలపై చిత్తశుద్ది లేని వారు పాదయాత్రతో సాధించేదేవిూ లేదన్నారు. న్యాయపరంగా ముందుకెళితే వైసిపి నుండి టిడిపిలో చేరిన వారందరూ సాంకేతికంగా ఇప్పటికీ వైసిసి సభ్యులుగానే ఉన్న నేపథ్యంలో పెద్దగా ఇబ్బందులు రావని చెప్పినట్లు సమాచారం. వైసిసి సభ్యులు అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన అనంతరం ప్రధాన ప్రతిపక్షం లేకపోతే సమస్యలొస్తాయని అధికారపక్ష సభ్యుల్లోనూ అభిప్రాయం వ్యక్తమైంది. ఇటీవల జరిగిన పార్టీ సమావేశాల్లో ఈ వ్యవహారంపై తీవ్రస్థాయిలో చర్చించారు. దీనిపై ముఖ్యమంత్రి కూడా అదే రీతిలో స్పందించి చట్టపరమైన చిక్కులు వస్తాయనే ఆలోచన అవసరం లేదని, సాంకేతికంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని తెలిపారు. అసెంబ్లీలో ఈ సారి సంక్షేమ పథకాలపై కీలక చర్చలు జరపాలని అధికారపార్టీ నిర్ణయించింది. ఈ చర్చను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించింది. దీనివల్ల ప్రజా సంక్షేమంపై చర్చలో ప్రతిపక్షం లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ముఖ్యంగా జగన్‌ బహిష్కరణ గురించి చర్చ చేయాలని, అవినీతి అక్రమాలపై దృష్టి సారించి చర్చనీయాంశం చేయడం ద్వారా అసెంబ్లీ వ్యవహారం ముందుకు రాకుండా చేయాలని సూచించినట్లు తెలిసింది. దీనిలో భాగంగానే రెండురోజులుగా టిడిపి రాష్ట్ర నాయకత్వం మొత్తం జగన్‌ అవినీతి వ్యవహారాలపై పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది.

తాజావార్తలు