ఎపి అసెంబ్లీ చారిత్రక నిర్ణయం

 

కాపు రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

వాల్మీకి బోయలను ఎస్టీలో చేరుస్తూ తీర్మానం

ఏకగ్రీవ తీర్మానంతో రెండు అంశాలకు సభ్యుల ఆమోదం

అమరావతి,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ఆంద్రప్రదేశ్‌ శాసనసభ రెండు విప్లవాత్మక నిర్ణయాలకు వేదికయ్యింది. కీలకనిర్ణయాలు తీసుకుని చరిత్ర సృష్టించింది. ఏళ్లతరబడిగా ఉన్న రెండు కీలక సమస్యలపై ముందడుగు వేసింది. కాపులను బిసిల్లో చేర్చే కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే బోయలను ఎస్టీల్లో చేరుస్తూ తీర్మానించింది. టిడిపి ఎన్నికల సమయంలో ఇచ్చి ఈ రెండు హావిూలపై కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది. కాపులను బిసిల్లో చేర్చాలన్న డిమాండ్‌ ఉండగా,దీనిపై సిఎం చంద్రబాబు ఎన్నకల సమయంలో హావిూ ఇచ్చారు. ఇకపోతే వాల్మీకులు, బోయలను ఎప్పటి నుంచో ఎస్టీల్లో చేర్చాలని కోరుతున్నారు. ఈ రెండు విషయాల్లో ఎపి అసెంబ్లీ శనివారం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. కాపుల రిజర్వేషన్‌ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. ఉదయం సభ ప్రారంభం కాగానే ఈ బిల్లును బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు నేతలు ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొని మాట్లాడారు. కాపులకు బీసీ ఎఫ్‌ కేటగిరీగా 5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఈ బిల్లును తీసుకువచ్చారు. అనంతరం వాల్మీకీ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ సభలో తీర్మానం చేశారు. వాల్మీకీ బోయల దశాబ్దాల డిమాండ్‌కు అసెంబ్లీ మద్దతు తెలుపుతోందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. వారిని ఎస్టీ జాబితాలో చేర్చడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హావిూలన్నీ నెరవేరుస్తున్నామని అన్నారు. తాను గతంలో చేపట్టిన పాదయాత్రలో కాపుల కష్టాలను చూశానని తెలిపారు. 2014లో ఇచ్చిన హావిూకి కట్టుబడి కాపులకు రిజర్వేషన్‌ కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కాపులకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు సంపూర్ణంగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. సమాజంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలనేదే తమ ఉద్దేశమన్నారు. కాపులకు రిజర్వేషన్‌ కల్పించడానికి 2016లో జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ వేశామని చంద్రబాబు తెలిపారు. బీసీ కమిషన్‌ అన్ని జిల్లాల్లో తిరిగి కాపుల ఆర్థిక, సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసిందని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు అని చంద్రబాబు అన్నారు. బీసీలు లేకుండా తెదేపా లేదని స్పష్టం చేశారు. బీసీలను ఎప్పటికీ విస్మరించేది లేదన్నారు. బీసీలకు బ్జడెట్‌లో రూ.10వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. బీసీలకు నష్టం చేసే పనులను తమ ప్రభుత్వం చేయదని స్పష్టం చేశారు. అలాగే వాల్మీకి, బోయలను ఎస్టీలో చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్నో రాష్టాల్ల్రో వాల్మీకి, బోయలు ఎస్టీ జాబితాలో ఉన్నారని, దశాబ్దాల డిమాండ్‌కు తాము మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. షెడ్యూల్‌ తెగలకు ఇబ్బంది లేకుండా రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఎన్నికల మానిఫెస్టోల్లో చెప్పిన విధంగా వాల్మీకి, బోయలను షెడ్యుల్‌ తెగలోకి చేర్చాలని చెప్పారు. వాల్మీకి, బోయల సంస్కృతి, వెనుకబాటుతనం, ఆర్థిక పరిస్థితులు, అనేక అధ్యయన కమిటీలు, కవిూషన్‌లు వీరిపై చేసిన సిఫారసులను పరిగణలోకి తీసుకుని వారిని షెడ్యూల్‌ తెగల జాబితాలో త్వరగా చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

తాజావార్తలు