ఎపి బిజెపిని నిరాశ పరిచిన విస్తరణ
హరిబాబు దక్షతను గుర్తించని మోడీ
అమరావతి,సెప్టెంబర్4(జనంసాక్షి): తాజా కేంద్రమంత్రివర్గ విస్తరణ ఎపి బీజేపీలో తీవ్ర నిరాశ మిగిల్చింది. అనేక పేర్లను తెరపైకి తీసుకుని వచ్చి చివరకు ఉసూరుమనిపించారు. ఇద్దరు ఎంపీలున్నా ఒక్కరికి కూడా మంత్రి పదవి లేదు. అలాగే పార్టీని నమ్ముకుని వచ్చిన వారికి కూడా ఎలాంటి పదవులు దక్కడం లేదు. దీంతో బిజెపి నేతలు కేంద్రమంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నా, నిరాశే మిగిలింది.ఏపీ పార్టీ అధ్యక్షుడు కే హరిబాబు తనకు కచ్చితంగా మంత్రి పదవి లభిస్తుందని ఆశించి ఏకంగా కుటుంబ సభ్యులతో ఢిల్లీకి పయనమైపోయారు. ఏపీ నుంచి పదవులు అశించిన వారిలో బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, కాకినాడ ఎంపీ గోకరాజు గంగరాజు కూడా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన పురంధేశ్వరీ, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మినారాయణ తదితరులు ఏపీకి తప్పకుండా కేంద్ర మంత్రి పదవులు వస్తాయని గట్టిగా నమ్మారు. వారి అంచనాలు తలకిందులు కావడంతో భవిష్యత్‌లో ఎలా మసులుకోవాలో అర్థం కాని పరిస్థితిలో వారున్నట్లు పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అయితే మంత్రి పదవికి హరిబాబు అన్ని విధాలా అర్హుడయినా ఎందుకనో ఆయనకు ఇవ్వకుండా టిడిపిలో ఇద్దరికి ఇప్పటికే మంత్రి పదవులు ఇచ్చారు. హరిబాబు ఉన్నత విద్యావంతుడే కాకుండా పార్టీకి నమ్మిన విధేయుడిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అందుకే పదవి రాకున్నా క్రమశిక్షణ కలిగిన నేతగా
తనకు అవకాశం వస్తుందని ఏవిూ ఆశించలేదని హరిబాబు స్పష్టం చేశారు. ఆ పదవి రాలేదన్న నిరాశ ఏవిూ లేదన్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం దక్కుతుందని భాజపా వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. శనివారం రాత్రి హరిబాబు కుటుంబసమేతంగా దిల్లీ వెళ్లడంతో… ఆ పార్టీ శ్రేణులు సంబరపడ్డాయి. ఆఖరు నిముషంలో కేంద్ర మంత్రి పదవి చేజారిపోవడానికి కారణాలేమిటన్నదానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. భాజపా అధ్యక్షుడిగా హరిబాబు ఎన్.డి.ఎ.లో భాగస్వామిగా ఉన్న తెదేపాతో స్నేహపూర్వక సత్సంబంధాలు నెరపడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. భాజపా, తెదేపా సంబంధాల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా చూడగలుగుతున్నారు. వచ్చే రెండేళ్లలోనూ పార్టీ పరంగా కీలకంగా వ్యవహరించాల్సి ఉన్నందున తాజా విస్తరణలో అవకాశం ఇవ్వలేదేమోనన్న చర్చ జరుగుతోంది.