ఎపి సైన్స్ కాంగ్రెస్‌కు శ్రీకారం
జిజ్ఞాస అలవర్చుకోవాలన్న మంత్రి గంటా
విశాఖపట్నం,నవంబర్7(జనంసాక్షి): విద్యార్థి దశ నుంచి శాస్త్ర, సాంకేతిక రంగాలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరముందని మంత్రి గంటా శ్రీనివాసరావు విద్యార్థులకు సూచించారు. మన విద్యార్థులు ఎన్నో ఆవిష్కరణలకు రూపమిస్తున్నారని, వారిలో విజ్ఞానాన్ని మరింత పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఏపీ సైన్స్ కాంగ్రెస్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు. ఏపీ అకాడవిూ ఆఫ్ సైన్సెస్, ఆంధ్ర విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగ కార్యదర్శి అశుతోష్ శర్మ, ఏపీ అకాడవిూ ఆప్ సైన్సెస్ అధ్యక్షుడు ఆచార్య దీక్షితులు, ఏయూ వీసీ నాగేశ్వరరావు సహా వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు పాల్గొన్నారు. సుస్థిర అభివృద్ధి దిశగా హరిత సాంకేతికత పరిజ్ఞానం అభివృద్ధి లక్ష్యంగా జరుగుతున్న సైన్స్ కాంగ్రెస్ మూడురోజుల పాటు కొనసాగనుంది.ఏపీ అకాడవిూ ఆఫ్ సైన్సెస్‌కు ప్రభుత్వం రూ.4కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.