ఎప్పుడు పేలుస్తారు బాంబు?

41482044757_625x300న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారని, ఆయన అవినీతికి సంబంధించి తన దగ్గర పక్కా సమాచారం ఉందని ప్రకటించి రాహుల్‌గాంధీ దుమారానికి తెరలేపిన సంగతి తెలిసిందే. తనను పార్లమెంటులో మాట్లాడనివ్వడం లేదని, ఒకవేళ మాట్లాడనిస్తే భూకంపం వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇంతకు రాహుల్‌ ప్రధాని మోదీ మీద చేయదలుచుకున్న అవినీతి ఆరోపణలు ఏమిటి? ఆయన దగ్గర పక్కా సమాచారం ఉంటే దానిని వెల్లడించడానికి రాహుల్‌ ఎందుకు మీనమేషాలు లెక్కబెడుతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.

రాహుల్‌గాంధీ శుక్రవారం కర్ణాటకలోని బెలగావిలోని బహిరంగ సభలో మాట్లాడారు. ప్రధాని మోదీపై సాధారణ రాజకీయ విమర్శలే తప్ప ఆయన సంచలన విషయాలేవీ వెల్లడించలేదు. నోట్ల రద్దు మోదీ సృష్టించిన విపత్తు అని, ఈ విపత్తు వల్ల వందమందికిపైగా చనిపోయారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాహుల్‌పై బీజేపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ప్రధాని మోదీ నిజస్వరూపం వెల్లడిస్తూ బాంబు పేలుస్తానంటూ రాహుల్‌ పేర్కొన్నారు. ఇంతకు ఆ బాంబు ఏది? ఎప్పుడు, ఎక్కడ పేలుస్తారు?’ అని ప్రశ్నించారు.

‘బెలాగావి సభ సందర్భంగా రాహుల్‌ భూకంపం వచ్చే ప్రకటనలు చేస్తారని నేను భావించాను. కొందరు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులు కూడా రాహుల్‌ కీలక విషయాలు వెల్లడిస్తారని పేర్కొన్నారు. ఏవి ఆ విషయాలు? ఆయన ఎప్పుడు తన బాంబును పేల్చబోతున్నారు’ అని బీజేపీ నేత ఎస్‌ ప్రకాశ్‌ పేర్కొన్నారు. రాహుల్‌లాంటి స్థాయి కలిగిన నాయకుడు ప్రధానమంత్రిపై సన్సేషనల్‌ కోసం పసలేని ఆరోపణలు చేయడం తగదని, ఇది ఆయన వ్యక్తిగత ప్రతిష్టనే దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి ఆరోపణలతో రాహుల్‌ తనకు తానే విపత్తులను సృష్టించుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మరోవైపు కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ రాహుల్‌కు పార్లమెంటులో మాట్లాడే అవకాశమిస్తే.. ప్రధాని నిజస్వరూపాన్ని బయటపెట్టి ఉండేవారని, కానీ ఆ అవకాశం లేదని వ్యాఖ్యానించారు.

తాజావార్తలు