ఏపీకి 13 వేల హెక్టార్ల భూమి ఎందుకు ??
నూతన రాజధాని పేరుతో వేల ఎకరాల రైతుల భూమిని అవసరం లేకపోయినా ప్రైవేట్ బడా సంస్థల కోసం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. వేలాది ఎకరాల అటవీ భూమిని కూడా తీసుకునేందుకు వేసిన ఎత్తులను చిత్తు చేస్తూ కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ సీఆర్‌డీఏకు ఝలక్ ఇచ్చింది. రాజధానిలో అటవీ భూమికి బదులు ఇతర చోట్ల 32,240 ఎకరాల అటవీ భూమి ఇవ్వాలని, అందుకు అనుమతి కోసం కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు సీఆర్‌డీఏ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏడాది క్రితం ప్రతిపాదనలను పంపింది. సీఆర్‌డీఏ పంపిన ప్రతిపాదనలపై పలు కొర్రీలను వేస్తూ ఇటీవల కేంద్రం తిరిగి వెనక్కు పంపించింది. రాజధాని రీజియన్ కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏకంగా 13 వేల హెక్టార్ల (32,240 ఎకరాలు) భూమి ఎందుకు అవసరమని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేపిటల్ సిటీ కోసం అవసరమైతే అటవీ భూమిని డీ నోటిఫై చేస్తామని చట్టంలో పేర్కొన్నాం తప్ప కేపిటల్ రీజియన్ కోసం కాదని కేంద్రం తెలిపింది. అయినా కేపిటల్ సిటీ కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున భూములను సేకరించినందున మళ్లీ అటవీ భూమి ఎందుకని ప్రశ్నించింది. పదేళ్లలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి 32 వేల హెక్టార్ల అటవీ భూమి వినియోగ మార్పిడిని కోరితే ఏపీ ప్రభుత్వం ఒక ఏడాదిలోనే 13 వేల హెక్టార్ల అటవీ భూమి వినియోగం మార్పిడి కోరడం ఏంటని నిలదీసింది.