ఏపీ కేబినెట్ కీలక భేటీ..
విజయవాడ : రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లే ప్రధాన చర్చనీయాంశంగా రాష్ట్ర మంత్రివర్గం విజయవాడలో ఇవాళ కీలక భేటీ నిర్వహించనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 3.2శాతం డీఏ పెంపునకు ఆమోందంతో పాటు వారి పిల్లల స్థానికత అంశంపైనా ఓ నిర్ణయం తీసుకోనుంది. రైతు ఆత్మహత్యలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై క్యాబినెట్ చర్చించనుంది. హైదరాబాద్ నుంచి స్వరాష్ట్రానికి తరలివెళ్లే ఉద్యోగుల పిల్లలకు స్థానికత కల్పించే అంశంపై చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. ఉద్యోగుల పిల్లలకు ఎన్నేళ్ల వరకూ స్థానికత కల్పించాలనే అంశంపై అడ్వకేట్ జనరల్ రెండు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన నాలుగేళ్లలోపు ఏపీకి తరలివచ్చే వారికి స్థానికత ఇవ్వాలా లేక ఈ పరిమితిని ఏడేళ్ల వరకూ పెంచాలా అన్న రెండు ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. కొత్త రాష్ట్రానికి తరలివచ్చే ఉద్యోగుల పిల్లలు ఏ జిల్లా వారు అనేదానితో సంబంధం లేకుండా వారు ఏ జిల్లాను ఎంచుకుంటే ఆ జిల్లాకు స్థానికులుగా పరిగణించాలన్నది ప్రభుత్వ యోచనగా తెలుస్తోంది. విద్య, ఉద్యోగ అవకాశాలకు ఇది వర్తించేలా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయనుంది. అలాగే ఉద్యోగులకు 3.2శాతం డీఏ పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
తాజాగా కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన వెయ్యికోట్ల రూపాయలు, వివిధ ప్రాజెక్టులపైనా మంత్రులు చర్చించే అవకాశముంది. ఇటు ప్రత్యేక హోదా సాధనకు తీసుకోవాల్సిన చర్యలపైనా ప్రధానంగా చర్చించనున్నారు. అక్టోబర్ 22న జరగనున్న అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. రాజధానికి భూమిలిచ్చిన రైతులకు ఆహ్వాన పత్రాల పంపిణీతో పాటు వారికి ఇతరత్రా బహుమతులు ప్రభుత్వం తరఫున ఏమైనా పంపాలా అన్నదానిపైనా అమాత్యులు చర్చించే అవకాశం ఉంది. ఇటీవల విజయవంతంగా చేపట్టిన గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం ప్రక్రియపైనా మంత్రివర్గం ప్రభుత్వానికి అభినందనలు తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటు రైతు ఆత్మహత్యలపై హైకోర్టు ఆదేశాలను కూడా అమాత్యులు చర్చించే అవకాశం ఉంది.