ఏ సమస్య ఉన్నా నన్ను నేరుగా కలవండి

– ఆర్టీసీ కార్మికులతో ఛైర్మన్‌ వర్ల రామయ్య
– ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరణ
అమరావతి, మే2( జ‌నం సాక్షి) : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్దితో కృషి చేస్తానని సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వర్ల రామయ్య అన్నారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఆర్టీసీ ఛైర్మన్‌గా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్మికులకు ఏ సమస్య ఉన్నా తనను నేరుగా కలవొచ్చని సూచించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ఉద్యోగులతో కలిసి పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, రవాణా మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మంత్రులు దేవినేని, ప్రత్తిపాటి, అమర్‌నాథ్‌ రెడ్డి, సోమిరెడ్డి, కొల్లు రవీంద్ర, జవహర్‌, ఆనంద్‌ బాబు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ.. ఆర్టీసీ ఛైర్మన్‌గా వర్ల రామయ్యపై గురుతర బాధ్యత ఉందన్నారు. ప్రయాణీకులకు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. తెదేపా హయాంలో ఆర్టీసీ వేగంగా అభివృద్ధి చెందుతోందని రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వం నుంచి ఆర్టీసీ పురోభివవృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల బడ్జెట్‌లో ఆర్టీసీలో కొత్త బస్సుల
కొనుగోలుకు రూ.200కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
కార్మికుల నిబద్ధతే ఆయువుపట్టు – ఎండీ
వర్ల రామయ్య నాయకత్వంలో అంతా కలిసికట్టుగా పనిచేసి ఆర్టీసీని అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు అన్నారు. కార్మికుల నిబద్దతే సంస్థకు ఆయువుపట్టని అభివర్ణించారు. వర్ల రామయ్యతో పాటు ఆర్టీసీ జోన్‌ ఛైర్మన్లు మింటె పార్థసారథి బాధ్యతలు స్వీకరించారు. రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకు ముందు ఆర్టీసీ కార్మికులతో కలిసి పోలీస్‌ కంట్రోల్‌ రూం నుంచి ఆర్టీసి కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వర్ల రామయ్య, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

తాజావార్తలు