ఓటరు నమోదులో సమస్యలు పరిష్కరించండి

గుంటూరు జిల్లాలో ఓటరు నమోదుకు ఎదురవుతున్న సమస్యలను ఈ నెల 15లోగా పరిష్కరించాలని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా అధికారులతో ఆయన గురువారం మాట్లాడారు. ఫారం 6, 7, 8, 8ఎ దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించి అర్హత గల వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. మరణించిన, ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లినా, ఇంటి తలుపులు తాళం వేసినా, డూప్లికేట్‌ అయిన వారి వివరాలను మరోసారి బీఎల్‌వోల ద్వారా విచారణ చేయించి జాబితా నుంచి పేర్లను తొలగించాలా .. వద్దా అన్న విషయాన్ని సంబంధిత నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నిర్ణయం తీసుకోవాలన్నారు. పోలింగ్‌ స్టేషన్ల వివరాలను కూడా మరోసారి పరిశీలించి త్వరితగతిన పోలింగ్‌ స్టేషన్లను నిర్ధారించాలని భన్వర్‌లాల్‌ ఆదేశించారు. 2016 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకోనున్న వారికి ఓటును నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు. ఇందుకు సంబంధించి అక్టోబర్‌ 5న ఓటరు ముసాయిదా జాబితాను అన్ని పోలింగ్‌ స్టేషన్ల వద్ద ప్రకటించాలన్నారు. జాబితాలోని మార్పు చేర్పులపై ఓటర్లు అభ్యంతరాలను తెలియజేస్తే వాటిని డిసెంబర్‌ 4లోపు పరిష్కరించాలని సూచించారు. అలాగే కొత్తగా ఓటరుగా పేరు నమోదు చేసుకునే వారు అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 4 వరకు ఫారం 6ను పూర్తి చేసి ఇవ్వాలన్నారు. 2016 జనవరి 11న ఓటర్ల తుది జాబితాను ప్రకటించాలని భన్వర్‌లాల్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే, సంయుక్త కలెక్టర్‌-2 ఎం వెంకటేశ్వరరావు, డీఆర్వో కె నాగబాబు, అన్ని నియోజకవర్గాల ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, ఏవో ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు