ఓటుకు నోటు కేసులో బాబుకు ఊరట
ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, చంద్రబాబు పాత్రపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ఏసీబీ ప్రత్యేక కోర్టు జారీచేసిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులు సీజ్ చేసిన టేపుల్లోని గొంతు ఏపీ సీఎం చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేస్తోందని, ఈ కేసులో ఆయనపై కూడా విచారణ జరపాలని కోరుతూ సీఆర్‌పీసీ సెక్షన్ 210 కింద మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదును విచారించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు.. ఆడియో టేపుల్లోని అంశాలపైనా విచారణ చేసి సెప్టెంబరు 29లోగా నివేదిక ఇవ్వాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి సెప్టెంబర్ 2న మధ్యంతర స్టే ఉత్తర్వులు ఇచ్చింది. తర్వాత ఈ వ్యాజ్యం మరో న్యాయమూర్తి ముందుకు విచారణకు వచ్చింది. ఈ వ్యాజ్యంలో తుది వాదనలు గత నెలలో ముగిశాయి. ఈ కేసులో తన వాదనలు వినాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ వ్యాజ్యంలో 97 పేజీల తీర్పును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్ చౌదరి శుక్రవారం వెలువరించారు.